ఏపీ మంత్రి రోజాను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రిపై సెటైర్లు పేల్చారు. ఇటీల మంత్రి రోజా చేసిన ఓ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. ‘హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన మంత్రి రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాగబాబు ట్వీట్‌పై జనసైనికులు స్పందిస్తున్నారు.. మంత్రిపై సెటైర్లు పేలుస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. మంత్రి రోజా తన సొంత నియోజకవర్గం నగరి పరిధిలోని నిండ్ర మండలంలో ఉన్న బీజీ కండ్రిక, ఎంసీ కండ్రికలో.. రూ.11 లక్షలతో నిర్మించిన తాగునీటి బోరు, పైపులైన్లను ప్రారంభించారు. ఈ ఫోటోలు, వీడియోలను మంత్రి సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఆ వెంటనే మంత్రి ప్రారంభించిన వాటర్ ట్యాక్ మీద సెటైర్లు మొదలయ్యాయి. నెటిజన్లు ‘వైఎస్ఆర్ పోలవరం’ను రోజా ప్రారంభించారంటూ ట్రోల్ చేశారు. అక్కడితో ఆగకుండా.. చిన్న ట్యాంక్‌కు రూ.11 లక్షలు ఖర్చయ్యిందా అని ప్రశ్నించారు.