నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరుగుతున్న భక్తుల రద్దీ

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాలను పుష్పాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఇవాళ శ్రీకాళహస్తిశ్వరస్వామి దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజల తర్వాత స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు. అలాగే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పది లక్షల మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల సమయంలో మొత్తం 30 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. విక్రయాల కోసం 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు.. మరో ఐదు అదనపు కౌంటర్లు ఉన్నాయి. మహిళలు, దివ్యాంగుల కోసం మూడు కౌంటర్లు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం 19 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భక్తల కోసం స్నానపుగదులు ఏర్పాటు చేశారు. పెద్ద సత్రం దగ్గర భక్తులు తమ వస్తువులను భద్రపరుకునేందుకు క్లోక్‌రూంలు అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీటికి కూడా ఏర్పాట్లు చేశారు.

అలాగే శనివారం నుంచి అన్నపూర్ణాభవన్‌లో భక్తులకు దేవస్థానం అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసింది. కైలాసద్వారం, హఠకేశ్వరం, వెంకయ్యసత్రం, పాతాళగంగ మార్గంలో దాతలు అన్నదాన శిబిరాలు ఉన్నాయి.. అలాగే సత్రాల్లో కూడా భోజన సదుపాయం ఉంది. భక్తులు దర్శనానికి వెళ్లేందుకు నాలుగు రకాల క్యూలైన్లను సిద్ధం చేశారు. ఉచిత దర్శనం, రూ.500 అతి శీఘ్ర దర్శనం, రూ.200 శీఘ్ర దర్శనం, శివదీక్షా భక్తుల క్యూలైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు. ఇరుముడి కలిగిన శివదీక్షా భక్తులకు విడతల వారీగా స్పర్శ దర్శనం ఉంటుంది.. మిగిలిన భక్తులందరూ స్వామి అలంకార దర్శనం చేసుకోవాలి. అలాగే కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. నిరంతరం ఏర్పాట్లపై పర్యవేక్షిస్తామని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *