విశాఖ ఉక్కు కర్మాగారంలో మరోసారి ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ SMS-2 (స్టీల్ మెల్ట్ షాప్)లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పేలిపోయింది. ద్రవ ఉక్కు పడటంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిలో ఒకరు డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు కాగా ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం క్షతగాత్రులను విశాఖ జనరల్ హాస్పిటల్‌కు తరలించింది.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది నవంబర్లో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదంలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. 2021 డిసెంబర్లో బీఎఫ్ యూనిట్‌లో ద్రవ ఉక్కు నేలపాలై మంటలు చెలరేగాయి. దీంతో రూ.50 లక్షల మేర నష్టం సంభవించింది. ఇప్పుడు ప్రమాదం సంభవించిన ఎస్ఎంఎస్-2లోనే 2020 డిసెంబర్‌లోనూ ద్రవ ఉక్కు లాడెల్ జారి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. అదే ఏడాది నవంబర్‌లో స్టీల్ ప్లాంట్ టీపీపీ-2లో టర్బన్ ఆయిల్ లీకైంది. దీంతో మంటలు చెలరేగి 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
2012 జూన్ 14న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. స్టీల్ మెల్టింగ్ షాప్-3లోని ఆక్సిజన్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం వాటిల్లింది.