Naveen Kumar, News18, Nagarkurnool
కొన్ని రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాద ఛాయలను మిగిల్చి వెళ్తూ ఉంటాయి. రోడ్డుపై వెళ్తున్న సమయంలో వాహనదారుడు తప్పు చేసినా.. ఎదురుగా వచ్చే వాహనం వారు తప్పు చేసినా ప్రమాదంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. వేగం ఒక కారణమవుతుండగా రోడ్డు నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వాహనాలను నడపడం కూడా మరొక కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిశ్చితార్థం చేసుకున్న మరుసటి రోజే ఓ యువకుడు అతని సోదరుడుమరణించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో విషాదాన్ని మిగిలించింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువకుడు అనంత లోకాలకు వెళ్లడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు రోదనలతో నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
బుధవారం నిశ్చితార్థం చేసుకున్న యువకుడు అతని సోదరునితో కలిసి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం తిమ్మాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై కళ్యాణ్రావ్, సమీప బంధువుల కథనం ప్రకారం చారగొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎదిరే రాజు (27) ఎదిరే అల్లాజి (31) వరసకు అన్నదమ్ములు. వీరిద్దరూ గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి గ్రామ శివారులోని వ్యవసాయ పొలానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరిగి వస్తుండగా జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపైకి చేరుకోగానే కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
ఇది చదవండి: ఈ శివలింగాన్ని తాకితే ఏదైనా బంగారమే..! వెయ్యేళ్లనాటి ఆలయం.. ఎక్కడుందంటే..!
యువకుల మీదుగా లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై కళ్యాణ్ రావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుండగా అల్లాజీ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. బుధవారం రాజుకు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థమైంది. ఈ నెల 12న పెళ్లికి లగ్న పత్రిక రాసుకోవాలని, త్వరలోనే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
శుభకార్యానికి వచ్చిన బంధువులు ఇంట్లోనే ఉండగా మరుసటి రోజు ఉదయం ఈ దారుణం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరో యువకుడు అల్లాజీకి భార్య రమణమ్మ దివ్యాంగురాలు కాగా, ఆమెతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కళ్యాణ్రావ్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజు అల్లాజి కుటుంబ సభ్యులను అచ్చంపేట గువ్వల బాలరాజు పరిమమర్శించారు. మృతుల కుటుంబాలని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.