WTC Points Table: నాగ్‌పూర్ టెస్టులో విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ దిశగా భారత్ ముందడుగు

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోపే ముగిసిన ఈ టెస్టులో టీమిండియా ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్‌ సెంచరీకి జడేజా, అక్షర్ హాఫ్ సెంచరీలు తోడవటంతో 400 పరుగులు చేసిన టీమిండియా.. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మెరుగుపర్చుకుంది.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ 58.93 శాతం రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. తొలి టెస్టులో విజయంతో టీమిండియా మరింత పుంజుకొని 61.67 శాతం రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఖాతాలో 53.33 శాతం రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది. ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నా ఆ జట్టు ఫైనల్ చేరుకుంటుంది. భారత్ చేతిలో ఓటమితో ఆసీస్ పీసీటీ 75.56 శాతం నుంచి 70.83 శాతానికి పడిపోయింది.

భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో మిగతా మూడు టెస్టుల్లో కనీసం రెండింట్లో విజయం సాధించాలి. 2021-23 డబ్ల్యూటీసీ సైకిల్‌లో 15 టెస్టులు ఆడిన భారత్ 9 విజయాలు సాధించి, నాలుగింట్లో ఓడింది. మరోవైపు ఆస్ట్రేలియా 16 టెస్టులు ఆడి 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది, రెండిట్లో ఓడింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ విషయంలో భారత్‌కు శ్రీలంక నుంచి ముప్పు పొంచి ఉంది. మార్చి నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల్లో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 60కిపైగా పర్సంటేజ్ పాయింట్లు చేరతాయి. భారత్ 3-1 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తే 61.92 పీసీటీతో ఆసీస్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఒకవేళ శ్రీలంక ఆడే చివరి టెస్టుల్లోనూ గెలిచినప్పటికీ ఆ జట్టు పీసీటీ 61.11కే పరిమితం అవుతుంది.

ఒక వేళ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయితే మాత్రం భారత్ 56.4 పీసీటీతో సౌతాఫ్రికా కంటే ముందుంటుంది. అప్పుడు టెస్టు సిరీస్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ ఓడిస్తే గనుక భారత్ ఫైనల్ చేరే అవకాశాలుంటాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 48.72 పీసీటీ ఉంది. ఆ జట్టు వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.

ఒక వేళ టీమిండియా గనుక 3-0 లేదా 4-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు రెండో స్థానం కోసం పోటీ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఉంటుంది. 4-0 తేడాతో ఆసీస్‌ ఓడిస్తే టీమిండియా ఖాతాలో 147 పాయింట్లు, 67.43 పీసీటీ చేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *