SEC vs PC Final : 23 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన సౌతాఫ్రికా 20 లీగ్ (SA20 League) ఆఖరి పోరాటానికి చేరుకుంది. జొహన్నెస్ బర్గ్ వేదికగా మరికాసేపట్లో జరిగే ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals)తో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape)తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సన్ రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫైనల్ కోసం సన్ రైజర్స్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక అదే సమయంలో ప్రిటోరియా క్యాపిటల్స్ ఒక మార్పు చేసింది. గాయంతో గత కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ వేన్ పార్నెల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
టోర్నీని వరుస ఓటములతో మొదలు పెట్టిన సన్ రైజర్స్ అనంతరం పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో లీగ్ టాపర్ గా నిలిచింది. అయితే అనంతరం అదే దూకుడును ప్రదర్శించలేకపోయింది. దాంతో లీగ్ దశ ముగిశాక 3వ స్థానంలో నిలిచి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇక సెమీస్ లో మార్కరమ్ సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో జొహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ పై నెగ్గి సన్ రైజర్స్ ఫైనల్ కు చేరుకుంది. కెప్టెన్ గా మార్కరమ్ తన మార్క్ ను చూపుతున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ ,బౌలింగ్ ల్లో సత్తా చాటుతున్నాడు. జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు.
ఇక అదే సమయంలో ప్రిటోరియా క్యాపిటల్స్ కూడా సూపర్ ఫామ్ లో ఉంది. లీగ్ టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టిన క్యాపిటల్స్.. పర్ల్ రాయల్స్ పై సెమీస్ లో విజయం సాధించి తుది పోరుకు చేరుకుంది. ఇక ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరగ్గా రెండింటిలోనూ ప్రిటోరియా క్యాపిటల్స్ గెలిచింది. ఫైనల్ పోరు శనివారమే జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ను ఆదివారానికి వాయిదా వేశారు. ఈ మ్యాచ్ ను స్పోర్ట్స్ 18 (టీవీ చానెల్), జియో సినిమా (డిజిటల్)లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తుది జట్లు
ప్రిటోరియా క్యాపిటల్స్
ఫిల్ సాల్ట్, కుశాల్ మెండీస్, డీ బ్రూన్, రైలీ రోసో, కోలిన్ ఇంగ్రమ్, బాష్, వేన్ పార్నెల్, ప్రిటోరియస్, ఆదిల్ రషీద్, నోకియా
సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
రాసింగ్టన్, బవుమా, హెర్మన్, మార్కరమ్ (కెప్టెన్), స్టబ్స్, జొర్డాన్ కాక్స్, యాన్సెన్, వాన్ డెర్ మార్వె, కార్స్, మగల, బార్ట్ మన్