కారు పరిమాణంలో ఉన్న గుర్తుతెలియని మరో వస్తువును కూల్చేసిన అమెరికా.. ఇదీ చైనాదేనా?

పొరుగు దేశం కెనడా మీదుగా ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును తమ యుద్ధ విమానం కూల్చేసినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ శనివారం ప్రకటించింది. ఉత్తర అలాస్కా తీరంలో 40 వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న వస్తువును అమెరికా, కెనడా సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి కూల్చివేశాయి. ఈ వస్తువు కారు పరిమాణంలో ఉందని, అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల ప్రకారం కూల్చివేసినట్టు పెంటగాన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. అటు, కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో సైతం దీనిని ధ్రువీకరించారు. కెనడా, అమెరికా సంయుక్తంగా గుర్తుతెలియని ఓ వస్తువును ఎఫ్-22 విమానంతో కూల్చేశాయని తెలిపారు. ఆ వస్తువు శిథిలాలను యూకోన్‌లోని తమ రక్షణ దళాలు స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలిస్తాయని పేర్కొన్నారు.

తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తాను మాట్లాడానని, అంతకుముందు ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చించారని ట్రూడో వివరించారు. తమ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోడానికి ఇరు దేశాలూ కలిసి పనిచేస్తాయని కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ట్వీట్ చేశారు. పౌరవిమానాల ప్రయాణాలకు దీని గమనం ప్రమాదకరమని భావించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గుర్తుతెలియని వస్తువును వెంటాడుతూ వెళ్లిన ఎఫ్‌-22 యుద్ధవిమానం.. ఏఐఎం-9ఎక్స్‌ సైడ్‌ వైండర్‌ క్షిపణిని ప్రయోగించి నేలకూల్చింది.

శకలాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. చైనా నిఘా బెలూన్‌‌ను కూల్చివేసిన రెండు రోజుల్లోనే ఇది జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గూఢచర్య బెలూన్ ఘటనకు స్పందనగా అమెరికా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆ దేశానికి చెందిన ఆరు సంస్థలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, మొత్తం ఐదు ఖండాల్లో చైనా నిఘా బెలూన్లు ఎగురుతున్నట్టు వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం వెలువరించింది. భారత్‌‌పై కూడా చాలా సంవత్సరాల నుంచి ఇవి ఎగురుతూ సైనిక వ్యవస్థల సమాచారం సేకరిస్తున్నాయని బాంబు పేల్చింది.

బైడెన్, ట్రూడో శనివారం మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ తెలిపింది. ‘‘NORAD, US నార్తర్న్ కమాండ్ బలమైన, సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు.. మా గగనతలాన్ని రక్షించడానికి సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు’’ అని పేర్కొంది. యూకాన్ మీదుగా వెళ్తోన్న వస్తువును కూల్చివేయగా.. ఆ శకలాలు అమెరికా ఉత్తర తీరంలో డెడ్‌హోర్స్ గ్రామానికి సమీపంలో పడిపోయాయని చెప్పింది.

Read Latest International News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *