మారిన జాతీయాదాయం ట్రెండ్స్​

మారిన జాతీయాదాయం ట్రెండ్స్​ ప్రస్తుత సంవత్సర ధరల్లో జాతీయాదాయాన్ని లెక్కిస్తే జాతీయాదాయంలో పెరుగుదల వస్తు ఉత్పత్తి పెరుగుదల, ధరల పెరుగుదల వల్ల సంభవించవచ్చు. ధరలు పెరుగుదల ప్రభావాన్ని తొలగించేందుకు జాతీయాదాయాన్ని స్థిర ధరల్లో లెక్కిస్తారు. లేదా ప్రస్తుత ధరలతో లెక్కిస్తే వాస్తవాదాయాన్ని పొందేందుకు జాతీయాదాయాన్ని డిప్లేట్​ చేస్తారు. ధరలు పెరుగుదల ప్రభావాన్ని తొలగించేందుకు డిప్లేటర్​ను ఉపయోగిస్తారు. అయితే జాతీయాదాయం అనేది జనాభా ప్రభావాన్ని లెక్కించదు. దీనికోసం జాతీయాదాయానికి బదులు తలసరి ఆదాయం గణించాలి. తలసరి ఆదాయం జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. వృద్ధిరేటు అంటే ముందు సంవత్సర జాతీయ ఆదాయం లేదా తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు, ప్రస్తుత సంవత్సర జాతీయ ఆదాయం లేదా తలసరి ఆదాయంలో వచ్చిన మార్పును శాతంలో వ్యక్తపరిస్తే వచ్చేది వృద్ధిరేటు. 

వృద్ధిరేటు (g)= Qt-Qt-1/Qt-1 X 100

నామమాత్రపు జాతీయాదాయం కంటే వాస్తవ జాతీయ ఆదాయమే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని సూచిస్తుంది. అయితే, వాస్తవ జాతీయాదాయం కూడా జనాభా పెరుగుదల ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోదు. అందుకే తలసరి ఆదాయాన్ని గణిస్తారు. ప్రణాళికలు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి 30 ఏండ్ల కాలంలో జాతీయాదాయ వృద్ధిరేటు 3.5శాతం మాత్రమే. అల్పంగా ఉన్న ఈ వృద్ధిరేటును ప్రొఫెసర్​ రాజ్​కృష్ణ హిందూ వృద్ధిరేటుగా వ్యాఖ్యానించారు. ఈ కాలంలో జాతీయాదాయ వృద్ధిరేటు కంటే తలసరి ఆదాయ వృద్ధిరేటు తక్కువగా 1.4శాతం మాత్రమే నమోదైంది. ఈ కాలంలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండటమే కారణం. తర్వాత 30 ఏండ్ల కాలంలో జాతీయాదాయ వృద్ధిరేటు 5.9శాతానికి పెరిగింది. అంటే రాజ్​కృష్ణ పేర్కొన్న హిందూ వృద్ధిరేటు భారతదేశం అధిగమించగలిగింది. ఈ కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు కూడా 3శాతంపైన పెరిగింది. మొదటి 30 ఏండ్లలో కంటే తర్వాత 30 ఏండ్లలో తలసరి ఆదాయ వృద్ధిరేటు అధికంగా ఉండటానికి 1980 నుంచి దేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గడమే కారణం.

2011–12 నుంచి 2020–21 జాతీయాదాయ వృద్ధి 4.8శాతం. మొదటి 30 ఏండ్లలో వృద్ధిరేటు కేవలం 3.5శాతమే(హిందూ వృద్ధి రేటు) తర్వాత 30 ఏండ్లలో 5.9శాతంగా నమోదైంది. మొత్తం 30 సంవత్సరాల్లో 4.7శాతం వృద్ధి నమోదైంది. సంస్కరణల తర్వాత ఈ వృద్ధిరేటు మరీ ఎక్కువగా కనిపిస్తుంది(6.4శాతం). ఇండియాలో 2011–12 స్థిర ధరల్లో 8 శాతం అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదైన సందర్భాలు 7. 

ప్రణాళికలు వృద్ధి 

1950–80 వరకు ఇండియాలో తక్కువ వృద్ధి నమోదైంది. దేశంలో పెట్టుబడి రేటు తక్కువగా ఉండటమే కారణం. మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనుకూలంగా ఉండేది కాదు. మొదటి ప్రణాళికలో వృద్ధిరేటు లక్ష్యం 2.1 కంటే సాధించిన వృద్ధిరేటు 4.6శాతం ఎక్కువగా ఉంది. రెండో ప్రణాళికలో 4.5 వృద్ధి లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ 4.1 శాతం మాత్రమే సాధించింది. 3, 4వ ప్రణాళికల్లో 5శాతంపైనే లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ 3శాతం వరకే సాధించడమైంది. ఐదో ప్రణాళికలో వృద్ధిరేటు లక్ష్యం అధిగమించడమైంది. నిరంతర ప్రణాళిక చివరి సంవత్సరం 1979–80లో రెండో అత్యధిక రుణాత్మక వృద్ధి 5.9శాతంగా నమోదైంది. ఆరో ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి, సేవారంగంలో మంచి వృద్ధిని సాధించడం వల్ల వృద్ధిరేటు లక్ష్యాన్ని మించడమైంది. ఏడో ప్రణాళికలో కూడా మంచి వృద్ధి నమోదైంది. సంస్కరణలు ప్రారంభించిన మొదటి ప్రణాళిక (8వ ప్రణాళిక)లో లక్ష్యం కంటే సాధించిన వృద్ధి ఎక్కువగా ఉంది(లక్ష్యం 5.6, సాధించింది 6.5). ఈ ప్రణాళికలో సాధించిన వృద్ధిని 9వ ప్రణాళికలో (5.4) సాధించలేకపోయాం. ఇందుకు వ్యవసాయం రంగం, మాన్యుఫాక్చరింగ్​ రంగం తక్కువ వృద్ధి సాధించడమే కారణం. 10వ ప్రణాళికలో జాతీయ ఆదాయ వృద్ధి 7.6శాతం కాగా, జీడీపీ వృద్ధి 7.8శాతం (లక్ష్యం 8శాతం). 9వ ప్రణాళికలో సాధించిన వృద్ధిరేటు కంటే ఇది ఎక్కువ. అంతేకాక ప్రపంచంలో చైనా తర్వాత వేగంగా వృద్ధి చెందిన దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. 11వ ప్రణాళికలో 9శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ సాధించిన జీడీపీ వృద్ధి 8శాతం, ఎన్​ఎన్​పీ 7.5శాతం. 12వ ప్రణాళికలో వృద్ధిరేటు లక్ష్యం 8శాతం. వాస్తవంగా సాధించిన ఎన్ఎన్​పీ వృద్ధి 6.7శాతం. అయినా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ వృద్ధిని సాధిస్తున్నాం.  అనుకున్న లక్ష్యం కంటే తక్కువ వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక మూడో ప్రణాళిక. ఇందుకు కారణం 1962 

చైనా దురాక్రమణ, 1965 పాకిస్తాన్​తో యుద్ధం, 1965–66, 1966–67ల్లో కరువును ఎదుర్కొన్నారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు అధికంగా నమోదైన ప్రణాళిక 11వ ప్రణాళిక(6). స్థిర ధరల్లో తలసరి ఆదాయ వృద్ధిరేటు అత్యల్పంగా నమోదైన ప్రణాళిక 4వ ప్రణాళిక (0.7శాతం). 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *