హైదరాబాదీలకు కేటీఆర్ క్షమాపణలు.. నెగ్గటమే కాదు తగ్గటం కూడా తెలుసు..

Hyderabad: హైదరాబాద్ వేదికగా ఎంతో కోలాహలంగా ఫార్ములా ఈ రేసింగ్ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. దేశంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించటాన్ని తెలంగాణ సర్కారు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అనుకున్నట్టుగానే.. దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామికవవేత్తలు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ నేతలతో పాటు పెద్దఎత్తున్న అభిమానులు.. పోటీలకు హాజరయ్యారు. మెరుపు వేగంతో దూసుకుపోయే కార్ల పోటీలను ప్రత్యక్షంగా చూస్తూ గ్యాలరీలల్లో కేరింతలు కొట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మంత్రి కేటీఆర్ మాత్రం ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో.. హైదరాబాద్ ప్రజలు క్షమాపణలు చెప్పారు. పెద్ద మనసుతో తమను మన్నించాలంటూ వినమ్రంగా వేడుకున్నారు. ఇంత పెద్ద ప్రొగ్రామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి.. అందరి చేత ప్రశంసలు పొందుతున్న సమయంలో.. ఇలా నగరవాసులకు కేటీఆర్ క్షమాపణలు చెప్పటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అయితే.. కేటీఆర్ క్షమాపణల వెనుక బలమైన కారణమే ఉంది. ఫార్ములా ఈ రేసింగ్ పోటీల నేపథ్యంలో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రేసింగ్ కోర్టును అధికారులు పకబ్బందీగా సిద్ధం చేసిన క్రమంలో.. పోలీసులు ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. 7వ తేదీ నుంచి మొదలు 12 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. దీంతో.. నిత్యం ఎన్టీఆర్ మార్గ్ ద్వారా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చుట్టూ తిరిగుతూ… ట్రాఫిక్‌లో ఇక్కట్లు పడ్డారు. అయితే.. కొంత మంది ” మీ రేసింగ్ కోసం మాకెందుకు ఈ కష్టాలు” అంటూ అసహనంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కూడా. అయితే వాళ్లకు నచ్చజెప్పి పోలీసులు పంపించారు.

ఇదిలా ఉంటే.. పోటీలకు ఒకరోజు ముందు.. అంటే ప్రాక్టీస్ రేసింగ్ జరిగే రోజున.. ఏకంగా వాహనదారులు రేసింగ్ కోర్టు మీదుగానే వాహనాలు పోనిచ్చారు. అయితే.. అది పోలీసుల భద్రతా వైఫల్యమే కారణమని విమర్శలు వచ్చాయి అది వేరు విషయమనుకోండి. మొత్తానికైతే.. ఈ రేసింగ్ వల్ల వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అయితే.. ఈ విషయం తెలిసి మంత్రి కేటీఆర్ స్పందించారు. పోటీల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమేనని.. అందుకు తమకు క్షమించాలని.. పెద్ద మనసు చేసుకుని మన్నించాలంటూ వేడుకున్నారు. ఈ పోటీల వల్ల కొంత అసౌకర్యం కలిగినప్పుటికీ.. దీని వల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, దేశానికి ప్రపంచ పటంలో మంచి గుర్తింపు లభిస్తుందని వివరించారు.

మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పినందుకు గానూ.. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు స్పందిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమైన నాయకుడని.. కేటీఆర్ నిజమైన నాయకుడంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. నెగ్గటం తెలుసు.. తగ్గటమూ తెలుసంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

97823277

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *