Equatorial Guinea : ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ ఏవో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి. తాజాగా మరో వింత వ్యాధి ప్రజలకు సోకుతోంది. దీని వల్ల ఇప్పటికే 8 మంది చనిపోగా.. మరో 200 మందికి పైగా ప్రజలను ఒంటరిగా క్వారంటైన్‌లో ఉంచారు. ఇదో రకమైన జ్వరం. ఈ జ్వరం సోకిన వారికి రక్తం కారుతోంది (hemorrhagic fever). ప్రభుత్వం టెస్ట్ శాంపిల్స్‌ని పంపించి పరీక్షలు జరిపిస్తోందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మితోబా ఒండో ఓ అయేకాబా తెలిపారు.
ఈ వ్యాధి తొలిసారిగా 7 ఫిబ్రవరి 2023న బయటపడింది. చనిపోయిన వారంతా ఓ అంత్యక్రియలకు వెళ్లి వచ్చినవారే. అక్కడ ఏదో జరిగింది. అదేంటో ఎవరికీ తెలియట్లేదు. అంత్యక్రియల దగ్గర వారికి ఏదైనా వైరస్ సోకిందా అనేది తెలియాల్సి ఉంది. అందుకే శాంపిల్స్‌ని పక్కనే ఉన్న గాబన్ (Gabon)కి పంపారు. ఈ జ్వర లక్షణాలు ఉన్నవారిని టెస్టింగ్ కోసం సెనెగల్ లోని దాకర్‌కి పంపారు.
రెండు గ్రామాల ప్రజలకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. అక్కడి వారిని బయటకు వెళ్లనివ్వకుండా ఆపేశారు. అలాగే ఆ గ్రామాల్లోకి ఎవర్నీ బయటి నుంచి వెళ్లనివ్వట్లేదు. ఆ రెండు ఊర్ల వారితో ఎవరైనా కలిశారా అనే అంశం తెలుసుకునేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. క్వారంటైన్ చేసిన 200 మందికి లక్షణాలు లేవు గానీ.. ఎందుకైనా మంచిదని విడివిడిగా ఉంచారు.
ఆఫ్రికాలో ఇప్పటికే ఎబోలా ఉంది. ఇది కూడా ఇలాంటిదే. ఎబోలా సోకిన వారికి కూడా రక్తం కారుతూ ఉంటుంది. కానీ.. కొత్త జ్వరం అలాంటిది కాదని అంటున్నారు. ఈక్వటోరియల్ గినియా పక్కనే ఉన్న కామెరూన్ అలర్ట్ అయ్యింది. గినియాకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఈ కొత్త వ్యాధి ఏంటన్నది తెలుసుకునేందుకు స్థానిక నిపుణులతోపాటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణులు ఎంటర్ అయ్యారు.
లక్షణాలు ఇవీ:
ఈ జ్వరం వచ్చిన వారికి ముక్కు నుంచి రక్తం కారుతోంది.
జ్వరం ఉంటోంది.
కీళ్ల నొప్పులు ఉంటున్నాయి.
అంతేకాదు.. జ్వరం వచ్చిన కొన్ని గంటల్లోనే చనిపోతున్నారు.
చైనాలో 2019లో ఇలాగే జరిగింది. వుహాన్ నగరంలో ఉన్నట్టుండి కొత్త వ్యాధి లక్షణాలు కనిపించాయి. అదే ఆ తర్వాత కరోనాగా తెలిసింది. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ కరోనా పూర్తిగా పోలేదు. అందువల్ల గినియాలో వచ్చింది ఏంటనేది త్వరగా తెలియాల్సి ఉంది. ఆలస్యమైతే ఇది మరో కరోనా కాగలదనే భయం ప్రజల్లో ఉంది.