T20 WC: అదరగొట్టిన భారత అమ్మాయిలు.. పాకిస్థాన్‌పై రికార్డ్ విజయం!

కేప్‌టౌన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగస్ (38 బంతుల్లో 53) అజేయ హాఫ్ సెంచరీకి.. రీచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్) మెరుపులు తోడవటంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. మహిళల టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కాగా.. ఓవరాల్‌గా ఇదే రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యష్టికా భాటియా (17), షఫాలీ వర్మ (33) శుభారాంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ 5.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. బాగా ఆడుతున్న దశలో భాటియాను సాదియా ఇక్బాల్ పెవిలియన్ చేర్చింది. జెమీమాతో కలిసి రెండో వికెట్‌కు 27 పరుగులు జోడించిన షఫాలీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద నష్రా సంధు అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. దీంతో భారత్ 65 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

జెమీమాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (16) పాక్ కెప్టెన్ మరూఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత్ 93 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో టీమిండియా విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్లో రీచా ఘోష్ హ్యాట్రిక్ ఫోర్లు బాదగా.. 19వ ఓవర్లో జెమీమా మూడు ఫోర్లు బాదడంతో భారత్ విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రెండో ఓవర్లోనే జావేరియా ఖాన్ వికెట్ కోల్పోయిన పాక్.. 12.1 ఓవర్లలో 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాక్ ఆడుతున్న తీరు చూస్తే.. ఆ జట్టు 130 పరుగులు చేయడమే గొప్ప అనిపించింది.

కానీ కెప్టెన్ బిస్మా మరూఫ్ (55 బంతుల్లో 68) మరో ఎండ్‌లో పాతుకుపోయింది. బిస్మా అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దూకుడుగా ఆడిన ఆయేషా నసీమ్ చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు పిండుకున్నారు. దీంతో పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వరల్డ్ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బౌండరీలను ఆపారు. కానీ చివరి రెండు ఓవర్లలో ఆయేషా ఇచ్చిన క్యాచ్‌ను రెండుసార్లు జారవిడిచారు. ఆఖరి ఓవర్లో క్యాచ్ వదిలేయడంతో అది కాస్తా సిక్స్‌గా వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *