మరో రెండు రోజుల్లో వాలంటైన్స్ డే రానుంది. ఈ వేడుకను చేసేందుకు ప్రేమికులు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే వాలంటైన్స్ డేను నిషేధించాలని కొందరు డిమాడ్ చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాలెంటైన్స్ డే శుభాకాంక్షల కార్డులను తగులబెట్టే కార్యక్రమాలను నిర్వహించినట్లు హిందుత్వ గ్రూప్ బజరంగ్ దళ్ ఆదివారం ప్రకటించింది.
VHP యువజన విభాగం కూడా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కార్యక్రమాలను నిర్వహించవద్దని ప్రజలను హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల ఈ కార్యక్రమాలు జరిగాయని తెలంగాణ భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు వీడియో సందేశంలో తెలిపారు. ఫిబ్రవరి 14న, పుల్వామాలో మరణించిన సైనికుల అమరవీరుల స్మారక కార్యక్రమాలను అన్ని మండల మరియు జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము.
కొంతమంది వ్యక్తులు తమ వ్యాపారాలను ప్రోత్సహించడానికి వాలెంటైన్స్ డే ఈవెంట్‌లను నిర్వహిస్తున్నారన్నారు. గతంలో కూడా అలా చేయవద్దని కోరామన్నారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. కానీ అలాకాదని ఎవరైన వాలంటైన్స్ డే నిర్వహిస్తే.. మేము ఖచ్చితంగా వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు వాలంటైన్స్ డే రోజున పార్కుల్లో పబ్బుల్లో యువతీ యువకులు కనిపిస్తే.. చర్యలు తీసుకుంటామని కూడా భజరంగ్ దళ ఇప్పటికే హెచ్చరించింది.
ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజును కాకుండా ఆ రోజు వీరజవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలని భజరంగ్ దళ్ పేర్కొంది. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదని, అదే తేదీన పుల్వామా దాడి(2019)లో చనిపోయిన మన వీర జవాన్లను యువతీ యువకులు స్మరించుకోవాలని భజరంగ్ దళ్ మంగళవారం వాల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు వాలంటైన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించాయి.