మోడీ షెడ్యూల్ : 10 మీటింగ్స్.. 90 గంటలు.. 10,800 కి.మీ. ప్రయాణం

మోడీ షెడ్యూల్ : 10 మీటింగ్స్.. 90 గంటలు.. 10,800 కి.మీ. ప్రయాణం ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. 90 గంటల్లో దాదాపు11వేల కిలోమీటర్లు ప్రయాణించి 10 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. శుక్రవారం మొదలైన ఆయన పర్యటన సోమవారంతో పూర్తికానుంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర నుంచి మహారాష్ట్రకు అక్కడి నుంచి యూపీకి అటు నుంచి కర్నాటక వరకు ఆయన సుడిగాలి పర్యటన కొనసాగనుంది. 

ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లారు. యూపీ రాజధాని లక్నోలో నిర్వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించారు. అటు నుంచి నేరుగా మహారాష్ట్ర చేరుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కొన్ని రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. ఆ తర్వాత ముంబైలో ఏర్పాటు చేసిన అల్ జైమైతస్ సైఫియా కొత్త క్యాంపస్ ప్రారంభించి రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా ప్రధాని మోడీ శుక్రవారం ఒక్క రోజే 2,700కిలోమీటర్లు కవర్ చేశారు. 

ఇక త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం ప్రధాని మోడీ అగర్తలాలో ల్యాండయ్యారు  అక్కడ అంబస్స, రాధాకిషోర్ పూర్ లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రాత్రికి మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రయాణించిన దూరం సుమారు 3000 కిమీలు.

ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి ఉత్సవాలని మోడీ ప్రారంభఇంచారు. అనంతరం అక్కడ నుంచి రాజస్థాన్ లోని దౌసాకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  ఆ తర్వాత రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ నుంచి నేరుగా ఆయన కర్నాటక రాజధాని బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈ లెక్కన పీఎం మోడీ ఆదివారం దాదాపు 1750 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. 

ఇక ఫిబ్రవరి 13 సోమవారం ఉదయం బెంగళూరులోని ఏరో ఇండియా 2023ను ప్రధాని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మళ్లీ త్రిపుర రాజధాని అగర్తలా వెళ్లి రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఇలా మోడీ సోమవారం మొత్తం 3,350 కిలోమీటర్ల ప్రయాణం చేనున్నారు. ఈ లెక్కన శుక్రవారం  ఉదయం నుంచి సోమవారం రాత్రి వరకు ప్రధాని నరేంద్రమోడీ మొత్తంగా 10,800 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. 4 రాష్ట్రాల రాజధానుల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని10 సభల్లో ప్రసంగిస్తారు.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *