SEC vs PC Final : తొలిసారి జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ (SA20 League)లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) చాంపియన్ గా నిలిచింది. ఆది వారానికి వాయిదా పడ్డ ఫైనల్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4 వికెట్ల తేడాతో ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals)పై ఘనవిజయం సాధించింది. లీగ్ మొత్తం సూపర్ ఫామ్ లో ఉన్న ప్రిటోరియా క్యాపిటల్స్ తుది మెట్టుపై బోల్తా పడింది. అదే సమయంలో ఫైనల్ ఫోబియాను అధిగమించిన మార్కరమ్ నాయకత్వంలోని సన్ రైజర్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్టర్న్ కేప్ కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న బవుమా (2) తొందరగా అవుటయ్యాడు.అయితే మరో ఓపెనర్ ఆడం రాసింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లతో) మ్యాచ్ గతినే మార్చేశాడు. జోర్డాన్ హెర్మన్ (22)తో కలిసి రెండో వికెట్ కు 61 పరుగులు జోడించాడు. అయితే ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన ఆదిల్ రషీద్ జోర్డాన్ ను అవుట్ చేశాడు. కాసేపటికే రాసింగ్టన్ కూడా అవుటయ్యాడు. కెప్టెన్ మార్కరమ్ (26) పరుగులు చేసి అనవసరపు షాట్ కు వెళ్లి అవుటయ్యాడు. ఇక్కడి నుంచి ఈస్టర్న్ కేప్ వరుసగా వికెట్లను కోల్పోయింది. జోర్డాన్ కాక్స్ (7), స్టబ్స్ (5) విఫలం అయ్యారు. దాంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే మార్కో యాన్సెన్ (13 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. వాన్ డెర్ మర్వె 4 వికెట్లతో ప్రిటోరియా క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. మగల, బార్ట్ మాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున కుశాల్ మెండీస్ (19 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రైలీ రోసో (19), జేమ్స్ నీషమ్ (19) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు.
తుది జట్లు
ప్రిటోరియా క్యాపిటల్స్
ఫిల్ సాల్ట్, కుశాల్ మెండీస్, డీ బ్రూన్, రైలీ రోసో, కోలిన్ ఇంగ్రమ్, బాష్, వేన్ పార్నెల్, ప్రిటోరియస్, ఆదిల్ రషీద్, నోకియా
సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
రాసింగ్టన్, బవుమా, హెర్మన్, మార్కరమ్ (కెప్టెన్), స్టబ్స్, జొర్డాన్ కాక్స్, యాన్సెన్, వాన్ డెర్ మార్వె, కార్స్, మగల, బార్ట్ మన్