Aero India Show : బెంగళూరు ఏరో ఇండియా షో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

బెంగళూరు.. ఎలహంక ఎయిర్‌ బేస్‌లో ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేక్ ఇన్ ఇండియా (Make in India) ప్రచారంలో భాగంగా.. దేశీయ విమాన రంగాన్ని ఈ ప్రదర్శన ఎలివేట్ చేస్తోంది. ఇందులో రకరకాల విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, విమాన రంగ కంపెనీల ఉత్పత్తులు, రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారు. వంద కోట్ల అవకాశాలకు ఇది రన్‌వే అనే థీమ్‌తో ఏరో ఇండియా 2023ని నిర్వహిస్తున్నారు.

“సరికొత్త ఇండియా ఈ 21వ శతాబ్దంలో ఏ అవకాశాన్నీ వదలుకోదు.. అలాగని హార్డ్ వర్క్ చేసే విషయంలో రాజీ లేదు” అని ప్రధాని మోదీ అన్నారు. “ఇప్పుడు ఇండియా అనేది ఓ మార్కెట్ మాత్రమే కాదు.. చాలా దేశాలకు శక్తిమంతమైన రక్షణ భాగస్వామి కూడా. ఆయుధాల హార్డ్‌వేర్ సప్లైలో కీలకమైన ఎగుమతిదారుగా భారత్ ఎదుగుతోంది” అని మోదీ తెలిపారు.

ఏరో ఇండియా అనేది ఓ ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది ఇండియా.. ఆత్మగౌరవం, సామర్ధ్యాల్ని తెలుపుతోంది అన్న మోదీ.. ఇది భారత కొత్త శక్తినీ, ఆశయాలనూ ప్రతిబింబిస్తోంది అన్నారు. తేజాస్ లాంటి యుద్ధ విమానాల్ని దేశీయంగా తయారుచేయడం అనేది.. భారత దేశ శక్తి సామర్థ్యాలకు ఓ రుజువు అని మోదీ వివరించారు.

ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకూ ఈ ప్రదర్శన ఉంటుంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన EMB-145, Su-30, MIG-29 యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *