IND vs AUS మూడో టెస్టుకి వేదిక మార్చేసిన బీసీసీఐ.. కారణం ఏంటంటే?

Ind vs Aus 3rd Test Venue: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య (India vs Australia ) మార్చి 1 నుంచి 5 వరకూ జరగనున్న మూడో టెస్టుకి వేదిక మారిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ టెస్టు మ్యాచ్‌కి ధర్మశాల (Dharamsala )లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ.. మైదానంలో ఇటీవల వేసిన పిచ్, ఔట్‌ఫీల్డ్‌ని ఇంకా పరీక్షించలేదు. దాంతో బీసీసీఐ పునరాలోచనలో పడిపోయింది.

భారత్‌లోని అన్ని స్టేడియాలతో పోల్చితే ధర్మశాల స్టేడియం చాలా భిన్నం. అక్కడి వాతావరణం, పిచ్ పేస్‌కి ఎక్కువగా అనుకూలిస్తుంటుంది. దాంతో వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌‌పీసీఏ) పిచ్, ఔట్‌ఫీల్డ్‌ని మళ్లీ వేసింది. వాస్తవానికి ఇలా పిచ్, ఔట్‌ఫీల్డ్‌ని మార్చిన తర్వాత దేశవాళీ మ్యాచ్‌‌ని అక్కడ నిర్వహించి పరీక్షిస్తారు. అనంతరం బీసీసీఐ క్యూరేటర్ చెక్ చేసిన తర్వాతే అందులో ఇంటర్నేషనల్ మ్యాచ్‌ని నిర్వహించేందుకు వీలవుతుంది.

కానీ.. ధర్మశాల స్టేడియంలో మార్పులు, చేర్పుల తర్వాత ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. దాంతో పిచ్ స్పందించే తీరుపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు. బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ ఇటీవల అక్కడికి వెళ్లి తనిఖీ చేసినా.. ఓ స్పష్టతకి రాలేకపోయాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ పెద్దలకి రిపోర్ట్ రూపంలో సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. బోర్డర్- గవాస్కర్ లాంటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీలోని కీలకమైన టెస్టు మ్యాచ్‌తో అక్కడ ప్రయోగాలు చేయడం శ్రేయష్కరం కాదని భావించిన బీసీసీఐ వేదికని మారుస్తున్నట్లు సోమవారం అధికారికంగా ఒక ప్రకటనని విడుదల చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గత శనివారం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి స్టార్ట్‌కానుంది.

ఇండోర్‌(Indore)లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ మార్చి 1 నుంచి జరుగుతుందని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌లు అన్నీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఈ ఇండోర్ స్టేడియం 2016లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చింది. అలానే 2019లో బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు మ్యాచ్‌ని అక్కడే భారత్ ఆడింది. ఇటీవల ఇండోర్‌లోనే భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే జరిగిన విషయం తెలిసిందే.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *