Janasena నుంచి నన్ను సస్పెండ్ చేయడానికి ఆయన ఎవడు: కేతంరెడ్డి

Janasena: నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. చిన్న విషయంలో ముందిరిన వివాదం పోలీస్ కేసుల వరకు వెళ్లింది. ఆ తర్వాత సస్పెన్షన్ల బాట పట్టింది. తాజాగా.. నెల్లూరు అర్బన్ జనసేన నేత Kethamreddy Vinod Reddy ని.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో వివాదం ఇంకా ముదిరింది. అసలు తనను సస్పెండ్ చేయడానికి మనుక్రాంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు కేతంరెడ్డి. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పానని స్పష్టం చేశారు.

‘ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీలో.. మరో కానిస్టేబుల్ కొడుకుకి టికెట్ ఇచ్చానని.. మీరంతా ఆశీర్వదించండి అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అందుకే ఆయన స్పూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. ఇటీవల పవనన్న ప్రజా బాట కార్యక్రమంతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాను. కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలకు చెబుతున్నాం. 270 రోజులుగా పవనన్న ప్రజా బాట నిర్వహిస్తున్నాం. ఇదే నినాదంతో.. ఇప్పటికీ లక్షా 50 వేల స్టిక్కర్లను నెల్లూరు నగరంలో అంటించాం’ అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వివరించారు.

‘ఒక స్టిక్కర్ మీద.. మరో స్టిక్కర్ అంటించారు. దాని గురించి మాట్లాడుకుందాం అని పిలిచాం. ఆ సమయంలో.. అవతలి వ్యక్తులు కేసు పెట్టారు. దీని గురించి సీఐ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ స్థాయికి దిగజారడం ఎందుకు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కుటుంబాలను వదిలి తిరుగుతున్నాం. అలాంటి ఎస్సీ, మైనార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఏంటి. ఇది చాలా బాధాకరం. ఇంత పని చేస్తున్నా.. మాకు ఇచ్చే బహుమానం ఇదా అని.. నాయకులు బాధపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని కేతంరెడ్డి వ్యాఖ్యానించారు.

‘ఈ పరిణామాల నేపథ్యంలో.. నన్ను సస్పెండ్ చేశారని చాలామంది ఫోన్ చేశారు. లెటర్ చూడాలని చెప్పారు. కానీ.. కనీసం ఆ లెటర్ కూడా నేను చూడలేదు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశాం. పార్టీ హైకమాండ్ కూడా చాలా క్లియర్ కట్‌గా ఉంది. పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్‌కు ఇక్కడ జరిగిన విషయాన్ని వివరించా. పార్టీ నాయకులను, కార్యకర్తలను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షులకు లేదని.. అధిష్టానం పెద్దలు నాకు చెప్పారు. అందుకే మళ్లీ నా పని నేను చేస్తున్నా. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు’ అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *