దేవుడికే నోటీసులు జారీ చేశారు. గుడి స్థలం మాదంటూ.. ఖాళీ చేయాలని… నోటీసులు ఇచ్చారు. ఈ షాకింగ్ ఘటన … మధ్యప్రదేశ్‌లో జరిగింది. అయితే దేవుడికి ఇలా నోటీసులు జారీ చేసింది మరెవరో కాదు.. రైల్వే అధికారులు. ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ ఏకంగా ఆంజనేయుడికే హుకుం జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మొరెనా జిల్లాలో సబల్‌గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్‌గేజ్ పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని గుర్తించారు అధికారులు, ఇక వెంటనే దానిని తొలగించాలంటూ ఆంజనేయుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును కూడా మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు రైల్వే అధికారులు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దేవుడిపై నోటీసులు ఇవ్వడం ఏంటని హనుమాన్ భక్తులు షాక్ అయ్యారు. దేవుడిపై నోటీసులు ఇవ్వడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. అయితే దీనిపై రైల్వే అధికారి మనోజ్‌కుమార్ వివరణ ఇస్తూ పొరపాటున దేవుడి పేరిట నోటీసు జారీ చేశామన్నారు. గుడి పూజారి పేరిట కొత్త నోటీసు ఇస్తామని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. మరోవైపు హనుమాన్‌కు ఇచ్చిన నోటీసులు నెట్టింట వైరల్ అవుతున్నాయి కొందరు నెటిజన్లు… దేవుడికే ఇచ్చిన నోటీసులకు సంబంధించిన ఫోటోలు తీసి నెట్టింట పెట్టి వైరల్ చేస్తున్నారు.