ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గురించి సంచలన వార్త తెరపైకి వచ్చింది. దశాబ్దాల కిందటివరకు శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించిన తమిళ ఈళం నాయకుడు బతికే ఉన్నాడంటూ తమిళార్ పెరమైప్పు అధ్యక్షుడు పజా నెడుమారన్ ప్రకటన చేశారు. తమిళనాడులోని తంజావూరులోని ముల్లివైక్కల్ ముత్రంలో సోమవారం (ఫిబ్రవరి 13) ఉదయం మీడియా సమావేశంలో నెడుమారన్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యులతో తాను టచ్‌లో ఉన్నానని తెలిపిన నెడుమారన్.. వారి కోరిక మేరకే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపారు.
‘ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారు. అంతేకాదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన త్వరలో ప్రజల ముందుకు వస్తారు. తమిళ ప్రజలకు నేను ఈ శుభవార్త చెబుతున్నందుకు గర్విస్తున్నాను. ప్రభాకరన్ విషయంలో ఉన్న అన్ని పుకార్లకు అతి త్వరలో ముగింపు పడుతుందని మేము భావిస్తున్నాం’ అని నెడుమారన్ అన్నారు.
ఎల్టీటీఈ కార్యకలాపాలకు వ్యతిరేకంగా శ్రీలంక సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ప్రభాకరన్ హతమయ్యాడని 2009 మేలో లంక సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. DNA పరీక్షలతో సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.
అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితి, శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ప్రభాకరన్‌కు అజ్ఞాతం వీడి ప్రజల ముందుకు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించిందని నెడుమారన్ అన్నారు. ‘తమిళ ఈలం ప్రజల కోసం ఆయన త్వరలో ప్రణాళికలను ప్రకటించబోతున్నారు’ అంటూ నెడుమారన్ మరో సంచలనానికి తెర తీశారు.