మహిళల ఐపీఎల్ వేలంలో మెరిసిన వైజాగ్ అమ్మ.. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఎంట్రీ

(DURGA ANAND MOHAN RAO PUDIPEDDI, NEWS 18, Visakhapatnam)

WPL Auction 2023 : ఒకప్పుడు  ఆ అమ్మాయికి క్రికెట్ అంటే ఏమో తెలియదు. అసలు బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. క్రికెట్ అంటేనే భయం. కానీ, క్రికెట్ ను కెరీర్ గా మార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేసిన తొలి ఆంధ్ర క్రికెటర్ గా రికార్డు కూడా సెట్ చేసింది. 16 ఏళ్ల 204 రోజులకే టీమిండియా తరఫున టి20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేసింది. అయితే ఎంత వేగంగా క్రికెట్ లో దూసుకొచ్చిందో అంతే వేగంగా కింద పడింది. అయినా క్రికెట్ కు ఏనాడు దూరం కాలేదు. అనంతరం పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనిచ్చినా క్రికెట్ ను మాత్రమ వదల్లేదు. తాజాగా ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL Auction 2023)కు సెలెక్ట్ అయ్యి అందరి చేత శబాష్ అనిపించుకుంది. ఆమె ఎవరో కాదు.. వైజాగ్ కు చెందిన స్నేహ దీప్తి.

సోమవారం జరిగిన వేలంలో స్నేహ దీప్తిని రూ. 30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మొదట ఆన్ సోల్డ్ గా నిలిచిన స్నేహను వేలం చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్నేహ వయసు 26 ఏళ్లు మార్చిలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాణిస్తే టీమిండియా తరఫున మళ్లీ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది.

మహిళల క్రికెట్ ను ఫాలో అయ్యే వారికి స్నేహ దీప్తి పేరు సుపరిచితం. తను బ్యాట్ పట్టుకుంటే కనీసం యాభై పరుగులు చేస్తుందని నమ్ముతారు. ఎలాంటి బంతులైనా బ్యాట్ తో బౌండరీలకు తరలించే సత్తా ఆమె సొంతం. ఎన్నో మ్యాచ్ లను గెలిపించింది కూడా.

చిన్ననాటి నుంచే

స్నేహ దీప్తి తన చిన్ననాటి నుంచీ బ్యాట్ పట్టి పరుగులు పారిస్తోంది. మొదట తన తమ్ముడు, నాన్నగారితో క్రికెట్ గ్రౌండ్ లో అడుగు పెట్టానని చెబుతారామె. తన రెండో తరగతి సమయంలో అసలు బ్యాట్ పట్టుకోవడమే సరిగ్గా రాని తనకు బాల్ ని గట్టిగా కొట్టడం పరుగులు తీయించడం వరకూ అన్నింటా కారణం నాన్నే అంటోంది. తండ్రి యు. రామకృష్ణ బ్యాడ్ మింటెన్ ప్లేయర్. అలా షటిల్ కోర్టు నుంచీ క్రికెట్ నెట్ వరకూ వెళ్లింది. తమ్ముడు క్రికెట్ ఆడుతున్నాడని తనకు తోడుగా వెళ్లిన స్నేహ అంచెంచెలుగా తన క్రికెట్ టేలెంట్ ను పెంచుకున్నారు.

తన కోచ్ లు అందరూ తనకు ప్రేరణ కలిగించారని  స్నేహ అంటున్నారు. అండర్ 12, అండర్ 19 ఆడారు. ఇక క్రికెట్ లో ఎన్నో విజయాలు సాధించిన ఆమెకు పెళ్లి, కోవిడ్ వల్ల గ్యాప్ ఇచ్చింది. క్రికెట్ ఆడటానికి కూడా అవ్వని సందర్భం అది. ఆ సమయంలో ఏడాది  పాటు క్రికెట్ ప్రాక్టీస్ కూడా  ఆగిపోయింది. స్నేహ కూడా ఈ కారణాలతోనే బరువు  పెరిగిపోయింది. ఫిట్ నెస్ కూడా అంతగా లేదు. క్రికెట్ కి శరీరం సహకరించనంతలా మారిపోయింది. ఇక క్రికెట్ దూరమైందని అనుకున్న క్రమంలో భర్త ఫిలిప్ ప్రోత్సాహం కొండంత అండలా దొరికింది. అటు తల్లిదండ్రులు.. ఇటు అత్తమామలు కూడా అంతే ప్రోత్సాహం అందించారు.

కాన్పు తర్వాత బిడ్డ తల్లిగా మారిన తర్వాత తనలో ఎన్నో మార్పులు వచ్చాయని అంటారు స్నేహ. అయితే క్రికెట్ పై ఉన్న మక్కువతో వాటన్నిటినీ అధిగమించానని అంటున్నారు. మళ్లీ తన కోచ్ లు, తన వాళ్లందరూ తనను ఇదివరకు క్రికెటర్ స్నేహలా మార్చడానికి ఏడాదిన్నర పైనే పట్టింది. మళ్లీ తాను పాత స్నేహలా మారిపోయారు. మళ్లీ మునుపటి బ్యాటింగ్ పటిమను కూడా చూపించారు. అలాగే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు దేశ జట్టుకు ఆడాలని ఉవ్విళ్లూరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *