ప్రకాశం జిల్లా టీడీపీ (TDP)లో రాజకీయం మారిపోయింది. ముఖ్యమైన నియోజకవర్గానికి ఇంఛార్జ్ బాధ్యతల్ని చూసిన ఆయన.. సడన్‌గా ఆ పదవి నుంచి తప్పుకుని ట్విస్ట్ ఇచ్చారు. చంద్రబాబు అక్కడ ఇంఛార్జ్‌ని నియమించలేదు.. ఇప్పటికీ ఆ పదవి ఖాళీగానే ఉంది. అయితే గతంలో ఇంఛార్జ్‌గా ఉన్న నేత.. పదవి లేకపోయినా సరే మొన్నటి వరకు టీడీపీలోనే ఉంటానన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి జనసేన పార్టీ వైపు అడుగులు వేశారు.
ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం టీడీపీకి ప్రత్యేకమనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా సరే.. దర్శిలో మాత్రం టీడీపీ విజయా సాధించింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న పమిడి రమేష్.. గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. నగర పంచాయితీ టీడీపీ గెలుచుకుంది. అయితే ఆ తర్వాత రమేష్ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. అప్పటి నుంచి అక్కడ కేడర్ సందిగ్థంలో ఉంది. రమేష్ కూడా తనకు పదవి లేకపోయినా ఫర్వాలేదు.. టీడీపీతోనే పయనం ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇటు నియోజకవర్గానికి ఇంఛార్జ్ నియామకం విషయంలో చంద్రబాబు (Chandrababu Naidu) ఎటూ తేల్చలేదు. దాదాపు ఏడాదికిపైగానే అక్కడ నడిపించే నాయకుడు లేకుండా పోయారు. కేడర్ మాత్రం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.. ఇంతలో పొత్తులో భాగంగా దర్శిని జనసేన పార్టీకి కేటాయిస్తారనే టాక్ మొదలైంది. ఏకంగా జబర్దస్త్ హైపర్ ఆదికి సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది.. టీడీపీ కూడా ఇంఛార్జ్‌ను నియమించకపోవడంతో ఈ ఊహాగానాలు నిజమేమో అనుకున్నారు.
ఇప్పుడు సడన్‌గా దర్శి టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేసిన పమిడి రమేష్ (Pamidi Ramesh) ట్విస్ట్ ఇచ్చారు. జనసేన పార్టీ (Janasena Party)వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. ఆయన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)ను కలిశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్‌తో కలిసి వెళ్లారు. దీంతో రమేష్ జనసేనలో చేరడం ఖాయమనే చర్చ మొదలైంది. మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నా సరే.. పమిడి రమేష్ జనసేన పార్టీలోకి వెళ్లడం ఖాయమైందంటున్నారు. దీంతో దర్శి రాజకీయం ఆసక్తికరంగా మారింది. రమేష్ ఇప్పటి వరకు జనసేనలో చేరతానని అధికారికంగా ప్రకటించలేదు. కానీ మనోహర్‌ను కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దర్శి నియోజకవర్గం విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన తర్వాత.. 2014లో శిద్దా రాఘవరావు ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో కొన్ని కారణాలతో శిద్దా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కదిరిబాబూరావు టీడీపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల వచ్చాక.. కదిరి బాబూరావు, శిద్దా రాఘవరావులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఆ తర్వాత కొంతకాలం ఇంఛార్జ్ లేకుండాపోయారు.. అప్పుడు టీడీపీ అధిష్టానం పమిడి రమేష్‌కు బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందనుకుంటున్న సమయంలో రమేష్ తప్పుకున్నారు.. దీంతో దర్శిలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి.
Read Latest
Andhra Pradesh News
and