(M.Balakrishna,News18,Hyderabad)
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఓ తుక్కు నిల్వ కేంద్రంలో ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కాలం చెల్లిన మందులు, సౌందర్య సాధనాలు, ఇతర రసాయనాలు నిల్వ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని గగన్ పహాడ్‌లోని స్క్రాప్ యార్డ్‌లో సంభవించిన ఈ భారీ పేలుడులో 10 మంది కార్మికులు గాయపడ్డారు. గగన్ పహాడ్‌లోని ఓకేఆర్ బ్రిడ్జి సమీపంలోని ఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు ఆర్‌జిఐ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
రసాయనాల వల్లే పేలుడు..
ఈ పేలుడు ధాటికి గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గడువు ముగిసిన మందులు, సౌందర్య సాధనాలు, ఇతర రసాయన పీసాలు ఈ గిడ్డంగిల్లో నిల్వ చేశారు. పేలుడు సమయంలో 10 మంది కార్మికులు అక్కడ ఉన్నారు. వారందరికీ కాలిన గాయాలయ్యాయి. వారికి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Komatireddy Venkat Reddy: కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదు..పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కార్మికులంతా ఉత్తరాది రాష్ట్రాల వారే..
ఈ పేలుడులో గాయపడిన వారిలో సద్దాం, సాహిల్, రాయల్,అఫ్తాబ్, ఇస్లాం, కమిల్, అమా, ప్రతాబ్ సింగ్, అర్మాన్, హసిన్ ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. తుక్కు గిడ్డంగి యజమాని సొహైల్, గడువు ముగిసిన మందులు , రసాయనాలను నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ కార్మికులకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Telangana New Secretariat: అంబేద్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ఓపెనింగ్?
హైదరాబాద్ నగరంలో వరుస ప్రమాదాలు..
పారిశ్రామికంగా దూసుకుపోతోన్న హైదరాబాద్ మహానగరంలో, శివారు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు నిత్యకృత్యంగా మారాయి. నిబంధనలకు విరుద్దగా భవనాలు నిర్మించడం, గిడ్డంగులు నిర్వహించడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని గిడ్డంగులను శివారు ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. అయితే వేలాది భవనాలు, గిడ్డంగుల నిర్వాహకులు, పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు, తరవాత లంచాలు తీసుకుని చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
గడచిన 3 నెలల్లోనే 6 అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంపై నగర ప్రజలు హడలి పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ గిడ్డంగులు నిర్మించి రసాయనాలు నిల్వ చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.