Valentine’s day Special : ఎమ్మెల్యే జగ్గారెడ్డి లవ్ స్టోరీ.. ప్రేమలోనూ ఫైరే!

కాంగ్రెస్‌లో కొందరు నేతలు మాట్లాడితే అదో సెన్సేషన్ అవుతుంది. ఏదో ఒక రాజకీయ రచ్చ కచ్చితంగా లేస్తుంది. అలాంటి ఫైర్ నేతల్లో ఒకరు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన… ఓ లవ్ స్టోరీ నడిపారంటే నమ్మడం కష్టమే. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఆయన ప్రేమలో పడ్డారు. టెన్త్ పాసై.. ఇంటర్ ఫెయిలైన జగ్గారెడ్డి.. 16 ఏళ్ల వయసులో చదువు ఆపేసి.. రాజకీయాల్లోకి వచ్చేశారు. 19 ఏళ్ల మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. 31 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇందులో లవ్ ట్రాక్ ఏది?

పైకి గంభీరంగా కనిపించే జగ్గారెడ్డిలో.. ఓ లవర్‌బాయ్ ఉన్నాడు. పదో తరగతి చదివేటప్పుడే ఓ అమ్మాయి వెంటపడ్డారు. ప్రేమలో నిండా మునిగారు. ఓ రోజు తన మనసులో మాటను ఆమెకు చెప్పేశారు. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. జగ్గారెడ్జిలో ఏదో తెలియని విజయానందం.

ప్రేమైతే స్టార్ట్ చేసిన ఆయన.. ఆమె స్టడీస్‌కి ఇబ్బంది కలిగించకూడదు అనుకున్నారు. అందుకే.. ఆమెను బాగా చదువుకోనిచ్చారు. ఫలితంగా ఆమె ఇంటర్ బైపీసీ, డిగ్రీలో బీకామ్ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందారు. ఆమెను పెళ్లి చేసుకున్న జగ్గారెడ్డి.. ఉద్యోగం మాన్పించేసి.. కుటుంబ బాధ్యతలు ఆమెకు అప్పగించారు. ఆమే… నిర్మల.

వీరికి ఇద్దరు సంతానం. కూతురు జయారెడ్డి, కొడుకు భరత్ రెడ్డి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటే.. అత్యంత గౌరవం అని చెప్పిన సతీమణి నిర్మల… ఆయన మాటే.. తన మాట అని తెలిపారు. ఏం చేసినా ప్రజా సేవకు కట్టుబడి ఉన్నారనీ… అందుకే ఈ స్థాయికి ఎదిగారని ఆమె న్యూస్18కి వివరించారు. తనకు ప్రపోజ్ చేసేనాటికే జగ్గారెడ్డి.. మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నారన్న ఆమె… ప్రేమించి పెళ్లి చేసుకునేవారు.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మలా జగ్గారెడ్డి.. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు.

ఇలా ప్రేమికుల రోజు నాడు ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బాధ్యతతో కూడిన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుందని నిరూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *