అదానీ ఎంటర్‌ప్రైజస్ లాభం రూ. 820 కోట్లు న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ డిసెంబర్ 2022 క్వార్టర్లో మంచి లాభం సంపాదించింది. ఈ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ లాభం రూ. 820.06 కోట్లని అదానీ ఎంటర్‌ప్రైజస్ ప్రకటించింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో కంపెనీకి రూ. 11.63 కోట్ల నష్టం వచ్చింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్బర్గ్రిపోర్టుతో అదానీ ఎంటర్‌ప్రైజస్ సహా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్ల ధరల మానిప్యులేషన్తోపాటు, ఫైనాన్షియల్అడ్జస్ట్మెంట్స్ చేస్తోందని హిండెన్‌బర్గ్ రిపోర్టు ఆరోపణలు చేసింది. తాజా డిసెంబర్ క్వార్టర్లో అదానీ ఎంటర్‌ప్రైజస్ రెవెన్యూ 42 శాతం పెరిగి రూ. 26,612.33 కోట్లకు ఎగసింది. ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ బిజినెస్ లాభం ఏకంగా 370 శాతం పెరిగి రూ. 669 కోట్లయిందని, మైనింగ్–న్యూ ఎనర్జీ బిజినెస్‌ల లాభం కూడా మూడు రెట్లు పెరిగిందని అదానీ ఎంటర్‌ప్రైజస్ వెల్లడించింది.
ఎయిర్‌పోర్టుల బిజినెస్ రెవెన్యూ డబులైందని, లాభం మాత్రం 29 శాతమే పెరిగిందని పేర్కొంది. మార్కెట్లోని ప్రస్తుత ఓలటాలిటీ (ఒడిదుడుకులు) తాత్కాలికమని రిజల్ట్స్ సందర్భంగా ఛైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. ఎదగడానికి, లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్‌కు తగిన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు పేర్కొన్నారు. స్టేక్‌హోల్డర్లందరికీ నిలకడగా లాంగ్‌టర్మ్ వాల్యూ క్రియేట్ చేయాలనేదే ఎప్పుడూ తమ లక్ష్యమని వివరించారు. కోల్ మైనింగ్, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, డిజిటల్ సర్వీసులు, మెటల్స్ వంటి రంగాలలో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిండెన్‌బర్గ్ రిపోర్టు ఆరోపణల నేపథ్యంలో రూ. 20 వేల కోట్ల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ను కంపెనీ విత్‌డ్రా చేసుకుంది. ఎఫ్పీఐకు సబ్స్క్రయిబ్ చేసిన ఇన్వెస్టర్లకు వారి సొమ్మును వాపస్ చేసింది.
రిజల్ట్స్ తర్వాత షేర్లు ర్యాలీ.. చివర్లో ప్రాఫిట్ బుకింగ్
డిసెంబర్ క్వార్టర్లో లాభాల ప్రకటన తర్వాత మంగళవారం సెషన్లో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ షేర్లు ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు 10 శాతం లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఒక దశలో అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు రూ. 1,889 ని తాకాయి. క్యూ 3 రిజల్ట్స్ ప్రకటించిన తర్వాతే షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. చివర్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా, లాభాల్లోనే ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈలో 1.91 శాతం లాభంతో రూ. 1,750.30 వద్ద క్లోజయ్యాయి.
ఇండిపెండెంట్ ఆడిటర్‌గా గ్రాంట్ థార్న్టన్…
హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అదానీ గ్రూప్ అన్ని రకాల ప్రయత్నాలనూ చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని గ్రూప్ కంపెనీల కోసం ఇండిపెండెంట్ ఆడిటర్‌గా ప్రముఖ అకౌంటెన్సీ ఫర్మ్ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకుంది. షేర్ల మానిప్యులేషన్తోపాటు, ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా ఆర్థిక సర్దుబాట్లు చేస్తోందని హిండెన్‌బర్గ్ ప్రధానంగా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రతిష్టను కాపాడుకోవడానికి అదానీ గ్రూప్ ప్రయత్నాలను తీవ్రం చేస్తోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగానే తమ మార్కెట్ విలువను పోగొట్టుకున్నాయి. ఫలితంగా ఆసియాలోనే సంపన్నుడిగా తన హోదానూ చైర్మన్ గౌతమ్ అదానీ వదులుకోవల్సి వచ్చింది. కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్‌పై ముఖ్యంగా గ్రాంట్ థార్న్టన్ ఫోకస్ పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాకపోతే, గ్రాంట్ థార్న్టన్ నియామకంపై పంపిన ఈ–మెయిల్‌కు అదానీ గ్రూప్బదులు ఇవ్వలేదు.
©️ VIL Media Pvt Ltd.