అసలైన రాజుకి నిర్వచనం ప్రభాస్.. ఆయన రేంజ్ ఆయనకే తెలీదు: తమన్నా

దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ (Prabhas) ఒకరు. బహుశా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ రేంజ్ పాన్ ఇండియా ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. కానీ, ప్రభాస్ ప్రవర్తనలో మాత్రం తాను పెద్ద హీరోనన్న బడాయి కనిపించదు. ఈ విషయాన్ని ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది కో-స్టార్లు ఇప్పటికే చెప్పారు.

అంతేకాదు, తనతో పనిచేసే నటీనటులు, చిత్ర యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి కథకథలు చెప్తుంటారు. షూటింగ్‌లో ఉన్నప్పుడు తనతో నటించే నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచే రకరకాల రుచికరమైన వంటకాలు వెళ్తుంటాయని ఇప్పటికే విన్నాం. అయితే, తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ప్రభాస్ ఆతిథ్యం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు.

‘ప్రభాస్ ఆతిథ్యం యూనివర్సల్. కనీసం 30 రకాల వంటకాలు కచ్చితంగా ఉంటాయి. కానీ, ఆయన దృష్టిలో ఇది అతిథులకు చేసే మర్యాద. ఆయనకు ఇది డబ్బుతో ముడిపడిన విషయమే కాదు. తనతో కలిసి పనిచేస్తున్న వారికి ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వడమే. ఆయనొక అయస్కాంత శక్తి. ఒక నిజమైన రాజుకి అసలైన నిర్వచనం ప్రభాస్. ప్రజల మీద ఆయన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది, తన చుట్టూ ఎంత స్టార్‌డమ్ ఉంది అనే విషయాలు ప్రభాస్‌కు తెలియవు, ఆయన పట్టించుకోరు’ అని తమన్నా చెప్పుకొచ్చారు.

గతంలో పూజా హెగ్డే, శృతి హాసన్, శ్రద్ధాకపూర్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు ఎంతో మంది ప్రభాస్ ఆతిథ్యం గురించి వెల్లడించారు. షూటింగ్ సమయాల్లో ఇంటి నుంచి వండి తీసుకొచ్చే రుచికరమైన భోజనంపై మనసు పారేసుకున్నారు. చాలా ఇంటర్వ్యూల్లో వీళ్లంతా ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ముందుగా ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తమన్నా కూడా చేరారు.

ప్రభాస్, తమన్నా కలిసి ‘రెబల్’ సినిమాలో ఫస్ట్ టైమ్ నటించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే, మళ్లీ ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం తమన్నాకు మరోసారి వచ్చింది. ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ఆమె కనిపించారు. ప్రస్తుతం తమన్నా.. ‘భోళాశంకర్’లో మెగాస్టార్ చిరంజీవి సరసన, ‘జైలర్’లో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జోడీగా నటిస్తున్నారు.

మరోవైపు, ప్రభాస్ ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, ‘రాజా డీలక్స్’.. ఇలా పెద్ద లైనప్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సలార్’ మూవీ‌ ముందుగా వచ్చే అవకాశం ఉంది. అయితే, మారుతి డైరెక్టర్‌లో తెరకెక్కుతోన్న ‘రాజా డీలక్స్’ ముందుగా వస్తుందనే వాదన కూడా ఇండస్ట్రీలో ఉంది. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఇదే లో-బడ్జెట్ మూవీ. ఆ తరవాత ‘ఆదిపురుష్’ భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతోన్న పీరియడ్ మూవీ. దీనికి ఓం రౌత్ దర్శకుడు. ఇక ‘ప్రాజెక్ట్ కె’ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *