JIO Mart: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిటైల్ సంస్థ జియో మార్ట్ గతేడాది ఎంతో ఘనంగా జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేగవంతమైన నిత్యావసర సరుకుల డెలివరీ సేవల కోసం ప్రారంభించిన ఈ సేవలు ఇప్పుడు మూసి వేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. గత ఏడాది 2022, మార్చిలో ఈ సేవలను తీసుకొచ్చారు పారిశ్రామిక వేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ. జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ (JIO Mart Express Service) ద్వారా 90 నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Retail Business) వర్గాల ప్రకారం ప్రస్తుతం ఈ సేవలు మూతపడ్డాయి. ఇకపై గూగుల్ ప్లే స్టోర్ నుంచి జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు. వెబ్ సైట్ కూడా డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఎవరైనా జియో మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే వాట్సాప్ ద్వారా జియో మార్ట్ సేవలను పొందాలని సూచన వస్తోంది. అలా వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసినట్లయితే డెలివరీకి కొన్ని గంటలు లేదా ఒక రోజు కూడా పడుతోంది. దీని ద్వారానే అర్థం అవుతోంది వేగవంతమైన డెలివరీ సేవలను జియో మార్ట్ నిలిపివేసిందని. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటాతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. అందులో భాగంగానే వాట్సాప్ ద్వారా జియో మార్ట్‌లో ఆర్డర్ చేసుకునే వీలు కల్పిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది 2022, మార్చిలో ఎంతో ఆర్భాటంగా జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ సేవలను నావీ ముంబైలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 200 నగరాల్లో ఈ సేవలను విస్తరించింది. అయితే, వేగవంతమైన సేవలు అందించాలని జియో మార్ట్ కోరుకోవడం లేదని సంస్థ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ సేవలకు మంచి ఆదరణ లభించింది. కానీ, ఏడాదిలోనే మూసి వేయడం గమనార్హం.
ఫాస్ట్ డెలివరీలో పోటీ..
ఈశా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సంస్థ ప్రతినిధిని ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ అనేది పైలట్ ప్రాజెక్ట్ అని, అది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అయితే, వివిధ పద్ధతుల్లో నిత్యావసరాల వ్యాపారం కొనసాగుతుందని కంపెనీ డిజిటల్ కామర్స్ బిజినెస్ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రస్తుతం జియో మార్ట్ దేశ వ్యాప్తంగా 350 కిపైగా నగరాల్లో సేవలిందిస్తోంది. మరోవైపు.. 35 నగరాల్లో వాట్సాప్, మిల్క్ బాస్కెట్ ద్వారా జియో మార్ట్ సేవలను అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో రిలయన్స్ ఉంది.
ఫాస్ట్ డెలివరీలో చాలా కంపెనీలు ఉన్నందున పోటీ ఎక్కువగా ఉంది. అందులో స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, బిగ్ బాస్కెట్‌కు చెందిన బీబీ నౌ, జెప్టో వేగవంతమైన ఈ కామర్స్ డెలివరీ సేవలను అందిస్తున్నాయి. మరోవైపు.. క్విక్ కామర్స్ స్టార్టప్ డుంజోలో రిలయన్స్ రిటైల్ సైతం భారీగా పెట్టుబడులు పెట్టింది. గత నెలలో జియో మార్ట్ 3 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుత నిర్ణయంతో మరింత మందిపై వేటు పడే అవకాశం ఏర్పడింది. డుంజో డెలివరీ సేవలను ఉపయోగించుకోవాలని జియో మార్ట్ యోచిస్తోంది.
97909086
97850261
97802463