ఆ విషయంలో నాగార్జున ఒక్కడే కరెక్ట్.. ఎంజాయ్ చేయడం తెలుసు: జగపతిబాబు

సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సంపాదన ఎవరిది అంటే కచ్చితంగా స్టార్ హీరోలదే అని ఎవరైనా చెబుతారు. హీరోలకు ఉన్న డిమాండ్‌ను బట్టి పారితోషికాలు వస్తుంటాయి. ఒకవేళ ఆ హీరోలే నిర్మాణ సంస్థలు పెట్టి సినిమాలు చేస్తూ అది అదనపు సంపాదన. సినిమా ఫట్ అయితే డబ్బు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. అయితే, స్టార్ హీరోల సంపాదనలపై ఎప్పటి నుంచో కొన్ని లెక్కలు నడుస్తున్నాయి. ఫలానా హీరో సంపాదన ఎంతో తెలుసా? ఆయనకు ఎన్ని లగ్జర్లీ కార్లు ఉన్నాయో తెలుసా? అని చర్చలు జరుగుతూనే ఉంటాయి.

ఇదిలా ఉంటే, హీరోల సంపాదనలపై తాజాగా నటుడు జగపతిబాబు (Jagapathi Babu) మాట్లాడారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. ‘‘అడిషనల్‌గా వచ్చే సున్నాలతో ఎలాంటి ఉపయోగం లేదని నా నమ్మకం. అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప ఏమీ ఉండదు. ఎక్కువసార్లు ఇబ్బంది పడతాం. ఈ విషయంలో అప్పుడూ చెప్తాను ఇప్పుడూ చెప్తాను నాగార్జున (Nagarjuna) ఒక్కడే కరెక్ట్. తనకు సంపాదించడమూ తెలుసు, ఖర్చు పెట్టడమూ తెలుసు. ఆ డబ్బుని ఎంజాయ్ చేయడమూ తెలుసు. డబ్బుకు ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు. తనకు ఎంత ఇచ్చుకోవాలో అంత ఇచ్చుకుంటాడు. అవతలవాళ్లకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. చాలా మందికి బ్యాలెన్స్ లేదు’’ అని చెప్పుకొచ్చారు.

డబ్బులను బ్యాలెన్స్ చేసే విషయంలో తాను జీరో అని జగపతిబాబు అన్నారు. తనకు ఎలాంటి లెక్క ఉండదని అన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తనకు ఈజీగా రూ.1000 కోట్ల ఆస్తి ఉండాలని.. కానీ తనకు క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఆ డబ్బంతా పోయిందని చెప్పారు. ‘‘ఆ డబ్బంతా జూదంలో పోగొట్టుకున్నానని, ఆడవాళ్లకు పెట్టేశానని అందరూ అనుకుంటారు. నేను పేకాట ఆడను. క్యాసినో ఆడతాను. నాకు అదంటే థ్రిల్. నేను గ్యాంబ్లర్‌ని కాదు. అక్కడ నేను వినోదాన్ని కొనుక్కుంటాను అంతే. అందరూ అనుకుంటున్నట్టు అక్కడ కోట్లు పోవడం అనేది నిజం కాదు. నా ఆస్తి అక్కడ పోలేదు. అది ఇవ్వటం వల్ల పోయిందో.. ఖర్చు పెట్టేయడం వల్ల పోయిందో.. ఎవరైనా కొట్టేయడం వల్ల పోయిందో.. కారణం ఏదైనా కావచ్చు పోయింది’’ అని జగపతిబాబు వెల్లడించారు.

డబ్బు పోయిందని తాను ఎప్పుడూ బాధపడలేదని.. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఎప్పుడూ అనుకోలేదని, అది తన ప్రయారిటీ కాదని జగపతిబాబు అన్నారు. ‘‘నేను ఎప్పుడూ లెక్కచూడలేదు. అక్కడ పోయింది నా డబ్బంతా. ఎవడో మోసం చేశాడు అనేది కరెక్ట్ కాదు. మోసం చేశాడో, వాడుకోవడం అంటారో, నీ చేతకాని తనం అంటారో.. కారణం ఏదైనా కావచ్చు. ఈ విషయంలో నేను ఎవరినీ నింధించాలని అనుకోవడం లేదు. ఎందుకిలా ఉన్నాను అనే తలకాయ నొప్పి నాకు వద్దు. ఈ విషయంలో నన్ను నేనే నింధించుకోవాలి. అలా అని ఈ విషయంలో నాకేమీ నిస్సంతోషం ఏమీ లేదు’’ అని జగపతిబాబు తెలిపారు.

తాను రూ.30 కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని.. ఆ లక్ష్యాన్ని చేరుకున్నానని తనకు గతేడాది తెలిసిపోయిందని జగపతి బాబు అన్నారు. తన కుటుంబం సంతోషంగా జీవించడానికి ఆ రూ.30 కోట్లు చాలని.. ఇదే విషయం కుటుంబానికి కూడా చెప్పానని స్పష్టం చేశారు. రూ.30 కోట్ల పక్కన మరో సున్నా పెట్టాలని తనకు లేదని వెల్లడించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *