LHB Coaches Benefits: తెలుగు ప్రజలకు సుపరిచితమైన గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. అయితే, పెద్ద ప్రమాదం జరిగినా ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు కారణంగా ఈ రైల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను వినియోగించడమేనని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. LHB కోచ్‌లు అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది.
తెలుగు ప్రజల బతుకు బండి ‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ ప్రమాదానికి గురవ్వడం రెండు రాష్ట్రాల్లో అలజడి సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు (12727) మంగళవారం ఉదయం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. ఆరు కోచ్‌లు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, పట్టాలు తప్పిన బోగీలు కాస్త దూరం అలాగే ముందుకెళ్లి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. LHB టెక్నాలజీ కారణంగా ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ ఏంటి? ప్రమాదం జరిగిన సమయంలో ఎలా పనిచేస్తుంది?
జర్మన్ టెక్నాలజీ
ప్రస్తుతం ఇండియన్ రైల్వే.. రైలు బోగీలన్నింటినీ LHB టెక్నాలజీతో రూపొందిస్తోంది. ఇది జర్మనీకి చెందిన టెక్నాలజీ. జర్మనీకి చెందిన Linke Hofmann Busch అనే సంస్థ భారత్‌లో ఈ కోచ్‌లను నిర్మిస్తోంది. దీంతో ఈ కోచ్‌లను అదే పేరుతో పిలుస్తున్నారు. అంతకుముందు ఇండియన్ రైల్వే ICF (Integral Coach Factory) కోచ్‌లను వినియోగించేది. పంజాబ్‌లోని కపుర్తలాలో ఐసీఎఫ్ బోగీలు తయారయ్యేవి. ప్రస్తుతం 50 శాతానికి పైగా రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో వీటిని ప్రవేశపెడుతున్నారు. 2020 మార్చి నాటికే 10,000 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించారు.
LHB కోచ్‌ల ప్రయోజనాలు:
✦ LHB కోచ్‌లు యాంటీ టెలిస్కోపిక్. అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు వాటి ముందున్న కోచ్‌లపైకి ఎక్కే ఆస్కారం ఉండదు.
✦ అధిక వేగంలోనూ సమర్థమైన బ్రేకింగ్ కోసం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ‘అడ్వాన్స్‌డ్ న్యూమాటిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్’ను వినియోగిస్తున్నారు.
✦ ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వేగం తగ్గి నిలిచిపోయేలా ఈ బోగీలను రూపొందించారు. రైళ్లు పరస్పరం ఢీకొన్నా, పట్టాలు తప్పినా.. బోగీలు ఒక దానిపైకి మరొకటి ఎక్కే ముప్పు ఉండదు.
✦ ఐసీఎఫ్ కోచ్‌లలో డ్యుయల్ బఫర్ సిస్టమ్ ఉండగా.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో సెంటర్ బఫర్ కప్లింగ్ (CBC) వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్‌తో ఢీకొట్టుకోకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది.
✦ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో రూపొందించారు. 180 kmph వేగం వద్ద కూడా ఈ కోచ్‌లు సత్ఫలితాలను ఇచ్చాయి. ఐసీఎఫ్ కోచ్‌ల గరిష్ట వేగం 110 kmph మాత్రమే.
✦ ఐసీఎఫ్ కోచ్‌ల కంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు 1.7 మీటర్లు అధిక పొడవు ఉంటాయి. ఫలితంగా జనరల్ క్లాస్‌లో అదనంగా రెండు వరుసలు, స్లీపర్ క్లాసులో అదనంగా మరో వరుస అందుబాటులోకి వచ్చాయి.
✦ ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు కూడా తక్కువే.
✦ LHB కోచ్‌లలో ‘కంట్రోల్డ్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్ (CDTS)’ ఉంటుంది. వీటిలో బయో-టాయిలెట్లు అమర్చి ఉంటాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.
✦ ICF కోచ్‌లతో పోలిస్తే, LHB కోచ్‌ల ద్వారా వచ్చే శబ్దం 40 శాతం తక్కువగా ఉంటుంది.
✦ LHB కోచ్‌లలో మెరుగైన ఎయిర్ కండిషనింగ్ సామర్థ్యం ఉంది.
కాపాడిన LHB టెక్నాలజీ.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అంత పెద్ద ప్రమాదం జరిగినా..!
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఈ టెక్నాలజీ ఉండటం వల్లే..
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో LHB కోచ్‌లు ఉండటం వల్లే పెద్ద ప్రమాదం జరిగినా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరు కోచ్‌లు (S1, S2, S3, S4, GS, SLR) పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. 200 మీటర్ల దూరం అలాగే ముందుకెళ్లి నిలిచిపోయాయి. బోగీలు ఒకదానిపైకి మరొకటి చేరకుండా LHB టెక్నాలజీ నివారించింది.
అర కిలోమీటర్ మేర ట్రాక్ ధ్వంసం
ఈ ప్రమాదం కారణంగా 400 మీటర్ల మేర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. అయితే, సిగ్నలింగ్ వ్యవస్థ మాత్రం డ్యామేజ్ కాలేదు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో 9 రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మరమ్మతు చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. 400 మీటర్ల మేర పూర్తిగా కొత్త ట్రాక్ నిర్మిస్తున్నారు. 800 దిమ్మెలు (స్లీపర్స్) ఏర్పాటు చేశారు. సిగ్నలింగ్ కోసం తాత్కాలికంగా కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం కల్లా ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రమాద స్థలంలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదాలు జరిగితే, వేగంగా స్పందించే వ్యవస్థ
ప్రమాదాలు జరిగితే వేగంగా స్పందించి సహాయక, మరమ్మతు చర్యలు చేపట్టేందుకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బందిని, సామగ్రిని అదే ట్రాక్‌పై ప్రత్యేక రైలులో ఘటనా స్థలికి చేర్చారు. ప్రమాదానికి గురైన 6 కోచ్‌లను విడదీసి, మిగిలిన కోచ్‌లను ప్రయాణికులతో ఉదయమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పంపించారు. ప్రమాదానికి గురైన ఆరు బోగీలను తిరిగి పట్టాల పైకి చేర్చారు. ప్రస్తుతం వీటిని సికింద్రాబాద్‌కు తరలిస్తున్నారు. దెబ్బతిన్న బ్రేకింగ్ వ్యవస్థ, ఇతర వ్యవస్థలను అక్కడ పునరుద్ధరించనున్నారు. రైల్వే సిబ్బందితో పాటు సుమారు 100 మంది కూలీలు మరమ్మతు పనుల్లో పాల్గొన్నారు.
Also Read:
తాను మరణిస్తూ తోటి సైనికుడి భార్య ప్రాణాలు కాపాడిన జవాన్