ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరావు (KCR) నేడు (ఫిబ్రవరి 15) జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అంజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారు. అయితే, కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆయన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న కాలంలో తన కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టు క్షేత్రానికి వచ్చారు. అక్కడి కొండపై కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపారు. నాడు చిన్న పిల్లలైన కేటీఆర్, కవితను వీపుపై ఎక్కించుకొని కాసేపు ఆడించారు. తాజాగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కేసీఆర్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత కొండగట్టుకు వచ్చారు. చివరిసారిగా ఆయన 1998లో కొండగట్టు ఆలయానికి వచ్చారు. అప్పటికి ఇంకా ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టలేదు. ఈ తర్వాత ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయాల్లో పలుమార్లు జగిత్యాలకు వచ్చినా.. కొండగట్టు ఆలయానికి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కొండగట్టుకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత డిసెంబర్ 7న జగిత్యాల జిల్లా మోతెలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నాటి సభా వేదికగా కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈ ఆలయాల అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రణాళికలను పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాస్తామని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. కొండగట్టు క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. యాదాద్రి నూతన ఆలయ నమూనాను ఈయనే రూపొందించారు. ఆగమ శాస్త్ర పండితులు, స్థపతుల అభిప్రాయాలను కూడా తీసుకొని, కొండగట్టును సమూలంగా అభివృద్ధి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
97940030
97940182