ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ బుస్సాపూర్

ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ బుస్సాపూర్ ప్రేమపెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ ములుగు జిల్లా బుస్సాపూర్. జిల్లా కేంద్రానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న అటవీ గ్రామంలో ఎన్నో ప్రేమ జంటలు ఉన్నాయి. గ్రామంలో జనాభా వెయ్యిలోపే. మొత్తం 220 ఇండ్లున్నాయి. ఇక్కడి వాళ్లలో ఎక్కువ మంది నిరుపేదలే. అయినా ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పచ్చని అడవిలో స్వచ్ఛమైన ప్రేమతో జీవిస్తున్నారు. 

గ్రామంలో 50 ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ఈ జంటల్లో చదువుకున్న వారితో పాటు..చదువుకోని వారున్నారు. ప్రేమ జంటల్లో ఎక్కువ మంది కులాంతర వివాహం చేసుకున్నవారే..అంతా పనులు చేసుకుంటూ ఎలాంటి గొడవలు పంచాయితీలు లేకుండా వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో ఎవరు గొడవలు పెట్టుకోని విడిపోయిన వారు లేరని గ్రామస్తులు అంటున్నారు. 

 

గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత పై చదువుల కోసం గోవిందరావు పేట, ములుగుకు వెళ్లేవారు. కలిసి వెళ్తూ సమయంలో కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇలా గ్రామంలో ఎన్నో ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. 

కొందరు ప్రేమికుల పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుడికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఊర్లోకి వచ్చి జీవిస్తున్నారు. పెళ్లయిన తర్వాత పెద్దలు చేరదీశారు. చెరో పని చేసుకుంటూ ఇప్పుడు సంతోషంగా ఉన్నామని పెళ్లయిన ప్రేమ జంటలు చెబుతున్నారు. 

ప్రేమపెళ్లి చేసుకుని విడిపోతే ఆ ప్రేమకు అర్థం లేదని కొందరు ప్రేమికులు అంటున్నారు. కష్టమైనా సుఖమైనా కలిసి బతకడంలోనే ఆనందం ఉందని చెబుతున్నారు. బుస్సాపూర్ లో ప్రేమ, కులాంతర వివాహం చేసుకున్న వారంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *