బస్టాండ్లలో జీవా వాటర్ కనిపిస్తలే

బస్టాండ్లలో జీవా వాటర్ కనిపిస్తలే హైదరాబాద్, వెలుగు : ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ఆర్టీసీ తీసుకొచ్చిన ‘జీవా’ వాటర్ బాటిల్స్ కు అంతగా ఆదరణ కరువైంది. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇతర బస్టాండ్లలో జీవా వాటర్ కంటే ప్రైవేట్ బ్రాండెడ్ వాటర్ బాటిల్స్, ఇతర కల్తీ వాటర్ బాటిల్స్ నే స్టాల్స్ నిర్వహకులు ఎక్కువగా అమ్ముతున్నారు. స్టాల్స్ లో జీవా బాటిల్స్ ను కనిపించి, కనిపించకుండా కింద ఉంచుతున్నారు. దీంతో ఆర్టీసీ తీసుకొచ్చిన జీవా బ్రాండ్ నామ్ కే వాస్తేగా మారిందని, ఆశించిన మేరకు ప్రయోజనం ఉండటంలేదని చెప్తున్నారు. ఆర్టీసీ హెడ్ ఆఫీసు అయిన బస్ భవన్ లో సైతం ప్రైవేట్ వాటర్ బాటిల్స్ నే అధికారులు వాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  

లక్షల మంది ప్యాసింజర్లు

జంట నగరాల్లో ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి నిత్యం తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు లక్షల మంది పబ్లిక్ జర్నీ చేస్తున్నారు. ఈ రెండు బస్టాండ్లతో పాటు దిల్ షుఖ్ నగర్, అమీర్ పేట, కూకుట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, ఎల్ బీ నగర్, అరాంఘర్, బీహెచ్ ఈఎల్ నుంచి సైతం వేల సంఖ్యలో బస్సులు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యల్లో వాటర్ బాటిల్స్ విక్రయాలు జరుగుతుంటాయి. బ్రాండెడ్ కంటే నకిలీ వాటర్ బాటిల్స్ ఎక్కువగా స్టాల్స్ నిర్వహకులు అమ్ముతూ ప్యాసింజర్లను మోసం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు 2 ఏళ్ల క్రింత ఆర్టీసీ బిస్లరీతో అగ్రిమెంట్ చేసుకొని, బస్టాండ్లలో ఆ బాటిల్స్ మాత్రమే అమ్మేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అవి కొంత కాలం రన్ అయ్యాక ఆ అగ్రిమెంట్ ను ఆర్టీసీ రద్దు చేసుకుంది. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు గత నెల 8న రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లు జీవా పేరుతో వాటర్ బాటిల్స్ ను లాంచ్ చేశారు. ఆర్టీసీలో ఏటా 90 లక్షల వాటర్ బాటిల్స్ వినియోగం జరుగుతుందని, అందుకే ఈ బాటిల్స్ తీసుకొచ్చామని లాంచింగ్ రోజు మంత్రి తెలిపారు. కానీ ఎంజీబీఎస్, జేబీఎస్ లో150 స్టాల్స్ ఉండగా కొన్ని స్టాల్స్ లోనే జీవా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు.

నకిలీ బాటిల్స్ పై లేని నిఘా   

వాటర్ బాటిల్స్ లో కిన్లీ, బిస్లరీ, టాటా వాటర్ ప్లస్, ఆక్వాఫినా వంటివి బ్రాండెడ్ గా ఉన్నాయి. అయితే, అచ్చం ఒరిజినల్ బ్రాండ్ ల మాదిరిగానే కన్పించేలా కుల్బీ, బినరయి, కిన్లీ ప్లస్ లాంటి పేర్లతో వస్తున్న నకిలీ వాటర్ బాటిల్స్ నిత్యం లక్షల సంఖ్యలో విక్రయిస్తున్నారు. వీటిపై ప్రభుత్వ నిఘా లేకపోవటంతో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ప్రైవేట్ బాటిల్స్ తయారీదారుల నుంచి ఆర్టీసీ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు చర్చ కూడా జరిగింది. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *