భారతీయ కంపెనీతో ఒప్పందం.. పది లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు..!

ఒకప్పుడు ఆర్థిక అవసరాల కోసం విదేశాల మీద ఆధారపడిన భారత్.. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలను ఆర్థిక మాంద్యం నుంచి ఒడ్డున పడేసేందుకు తన వంతు సహకరిస్తోంది. పెద్ద ఎత్తున విమానాలు కొనుగోలు చేయాలని ఎయిరిండియా తీసుకున్న నిర్ణయం.. అమెరికా, యూకే పాలిట వరంలా మారింది. ఎయిరిండియా సంస్థ 220 బోయింగ్ విమానాలు, 250 ఎయిర్ బస్ విమానాల కొనుగోలుకు ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎయిర్ ఇండియా-బోయింగ్ ఒప్పందం ద్వారా అమెరికాలోని 44 రాష్ట్రాల్లో, పది లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాలు పొందే వారిలో చాలా మందికి నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ కూడా అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్య బలానికి నిదర్శనమని అగ్రరాజ్య అధినేత వెల్లడించారు. ఈ ఒప్పందం అనంతరం ప్రధాని మోదీ, బైడెన్ టెలిఫోన్లో మాట్లాడారు.

కోవిడ్-19 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ క్షీణించింది. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తున్న సూచనలు కనిపించాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది. అమెరికా కేంద్రంగా పని చేసే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు పెద్ద సంఖ్యలో లే ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిరిండియా బోయింగ్‌‌‌తో 46 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున నిధులు మళ్లనున్నాయి. ఈ ఒప్పందం వల్ల పది లక్షల మందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అమెరికాకు పెద్ద ఊరట అనే చెప్పొచ్చు. ఎయిరిండియా-బోయింగ్ డీల్‌ను చారిత్రాత్మక ఒప్పందంగా బైడెన్ అభివర్ణించారు.

ఎయిర్ బస్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం చేసుకుంది. ఎయిర్ బస్ ఫ్రెంచ్ కంపెనీ అయినప్పటికీ.. ఆ సంస్థ యూకేలో 25 చోట్ల కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్ బస్ నుంచి 40 ఏ350 వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 210 ఏ320 నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిరిండియా కొనుగోలు చేయనుంది. ఈ విమానాల రెక్కలు, ఇంజిన్లను యూకేలోనే తయారు చేయనున్నారు. దీని వల్ల వందలాది ఉద్యోగాలు లభించడంతోపాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఎయిరిండియా-ఎయిర్ బస్ ఒప్పందం ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలోకి బిలియన్ పౌండ్ల మేర నిధులు వస్తాయని యూకే ప్రధాని రుషి సునాక్ తెలిపారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో కలిసి ముందుకు సాగడం బ్రిటన్‌కు లాభిస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియాకు నష్టాలు వస్తుండటంతో.. మోదీ సర్కారు దాన్ని విక్రయించాలని నిర్ణయించగా.. గత ఏడాది ఆరంభంలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *