భారత క్రికెట్ జట్టుపై స్టింగ్ ఆపరేషన్‌.. సంచలన విషయాలు చెప్పేసిన చీఫ్ సెలెక్టర్

Chief Selector Chetan Sharma Sting Operation : భారత క్రికెట్ జట్టులో జరుగుతున్న విషయాల గురించి సంచలన విషయాల్ని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma ) ఓ ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పేశారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య చెలరేగిన వివాదం, భారత ఆటగాళ్లు మ్యాచ్‌కి ముందు ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించాడు. ఇప్పుడు చేతన శర్మ మాటలు భారత క్రికెట్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.

భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ గురించి చేతన్ శర్మ ఆ స్టింగ్ ఆపరేషన్‌లో ఏం చెప్పాడంటే? ‘‘భారత క్రికెటర్లు ఒకవేళ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోతే.. మ్యాచ్‌కి ముందు ఇంజెక్షన్ తీసుకుని కనీసం 80% ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు’’ అని వెల్లడించాడు. బుమ్రా కనీసం కిందకి వంగలేని పరిస్థితులో ఉన్నాడని.. మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేట్‌గా ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆ ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ కాదని.. ఒకవేళ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకుంటే డోపింగ్ టెస్టులో దొరికిపోతారని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ వివాదం గురించి మాట్లాడుతూ ‘‘సౌరవ్ గంగూలీ కారణంగానే విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ కోల్పోయినట్లు భావిస్తున్నాడు. కానీ ఆరోజు సెలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపు 9 మంది ఉన్నాం. గంగూలీ ఆ మీట్‌లో కోహ్లీతో కెప్టెన్సీ వదిలేయడంపై ‘మరోసారి ఆలోచించు’అని చెప్పాడు. బహుశా.. కోహ్లీ ఆ మాటలు వినలేదేమో? కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ పరోక్షంగా గంగూలీని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడాడు. తనకి చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆరోపించాడు. దాంతో కోహ్లీ అబద్ధం చెప్తున్నాడని గంగూలీ చెప్పాడు. కానీ కోహ్లీ ఎందుకు అబద్ధం చెప్తాడు? అని అందరూ అనుకున్నారు. అక్కడ మొదలైంది బోర్డు vs ప్లేయర్ల గొడవ’’ అని చేతన్ శర్మ వెల్లడించాడు.

‘‘రోహిత్ శర్మకి సౌరవ్ గంగూలీ అనుకూలం ఏమీ కాదు.. కానీ విరాట్ అంటే మాత్రం అతనికి నచ్చదు. రోహిత్ శర్మ ఇకపై టీ20 జట్టులో ఎక్కువ కాలం కొనసాగడు. అతనితో పాటు విరాట్ కోహ్లి కూడా కష్టమే. హార్దిక్ పాండ్యకి కెప్టెన్సీ ఇచ్చి.. శుభమన్ గిల్‌కి అవకాశాలిస్తాం’’ అని చేతన్ శర్మ వెల్లడించాడు. భారత్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *