మా ఇంట్లో ఉన్న హీరోలు నాకెప్పుడూ క్యారెక్టర్ ఇవ్వలేదు.. సుస్మిత ఇచ్చింది: నాగబాబు

‘మా ఇంట్లో చాలా మంది హీరోలున్నారు. కానీ, నాకు ఎవరూ ఎప్పుడూ ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ హనీ (సుస్మిత) నాకు అవకాశం ఇచ్చింది. అంటే ఇది రెండోది. ఇంకో వెబ్ సిరీస్‌లో కూడా అవకాశం ఇచ్చింది’ అని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu). గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల (Sushmita Konidela) దంపతులు నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ జంటగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ తండ్రి పాత్రలో నాగబాబు నటించారు. ఈనెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది.

చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాతలు విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెలతో పాటు హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, గౌరి, నాగబాబు, దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సుస్మితపై ప్రశంసలు కురిపించారు. తన ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా వాళ్ల సాయం తీసుకోకుండా స్వతహాగా ఎదిగేందుకు సుస్మిత ప్రయత్నిస్తోందని కొనియాడారు.

‘‘సుస్మితకు సపోర్ట్‌గా చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్లలో ఎవరిని చేయమన్నా సరే కళ్లు మూసుకుని ముందుకొచ్చి చేస్తారు. కానీ, స్టార్ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్‌గా, ఒక సాధారణమైన ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు తను తీసుకుంటూ, అంత అనుభవం సంపాదిస్తూ మీ ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చింది. దీనికి ముందు కొన్ని వెబ్ సిరీస్‌లు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. కచ్చితంగా చెప్తున్నాను.. త్వరలోనే మా హనీ (సుస్మిత) మెగా ప్రొడ్యూసర్ కాబోతోంది, కచ్చితంగా అయ్యితీరుతుంది. మా విష్ణు కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరికీ నా శుభాకాంక్షలు’’ అని నాగాబాబు అన్నారు.

ఆ తరవాత దర్శకుడు ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. ‘సాధారణంగా నేను కథ వింటాను. నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని నేను అడగను. అలాగే ప్రశాంత్ చెప్పిన కథ విన్నాను. కథ వినేటప్పుడు ఒకచోట అతను చెప్పిన నెరేషన్‌కి నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయి. కుర్రాడు చాలా బాగా చెప్పాడు.. చెప్పినప్పుడు బాగానే ఉంటుంది కానీ, స్క్రీన్ మీదికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎప్పుడూ డౌటే. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అతను ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది’ అని నాగబాబు కొనియాడారు.

ఇక హీరో సంతోష్ శోభన్ గురించి చెబుతూ.. తాను ఇప్పటి వరకు సంతోష్ సినిమాల ట్రైలర్స్ మాత్రమే చూశాను కానీ సినిమాలు చూడలేదని అన్నారు. కానీ, తొలిసారి ఆఫ్ స్క్రీన్‌లో సంతోష్ నటన చూసి చాలా ముచ్చటపడ్డానని చెప్పారు. ‘సంతోష్‌ తండ్రి శోభన్‌ నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఆయన వారసులుగా వీళ్లు ముందుకు వచ్చినప్పుడు.. వీళ్లు డైరెక్టర్ శోభన్ గారి పిల్లలు అని. గోల్కొండ హైస్కూల్ సినిమా వచ్చినప్పుడు. ట్రైలర్‌లో చూసినప్పుడు బాగా చేశాడని అనుకున్నాను. ఈ సినిమాలో చేసినప్పుడు మాత్రం అతనికి లోపల ఎంత టెన్షన్ ఉందో తెలీదు కానీ బయటికి మాత్రం చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్‌లో చిన్న యాటిట్యూడ్, ఇగో ఉంటుంది. అది చాలా బాగా చేశాడు. తన పెర్ఫార్మెన్స్ నాకు నచ్చింది’ అని కొనియాడారు.

ఇక సినిమాల్లో మహిళల ప్రస్తావన తీసుకొచ్చిన నాగబాబు.. టెలివిజన్ విషయంలో ఫిమేల్ డామినేషన్ కనిపిస్తుంది కానీ, సినిమా విషయంలో మేల్ డామినేషనే ఉందని అన్నారు. ‘ఆడ పిల్లలను సినిమా పరిశ్రమలోకి పంపించకూడదు, వారు నటించకూడదు, చిత్రాలు నిర్మించకూడదు.. ఇలాంటి ఆలోచనతో ఇంకా మనలో చాలామంది ఉన్నారు. బయటేకాదు మా ఇండస్ట్రీలోనూ ఉన్నారు. అవకాశం ఇస్తే ఆడవారు మగవారి కంటే బాగా యాక్ట్‌ చేయగలరు. సినిమాలకు దర్శకత్వం వహించగలరు. సినిమాలు తీయగలరు. చాలామంది ఈ విషయాన్ని రుజువు చేశారు’ అని నాగబాబు అన్నారు.

97959404

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *