ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు తీసుకొచ్చామని ప్రభుత్వం గతంలో చెప్పగా.. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బెంగళూరులో నిర్వహించిన ‘బెంగళూరు ఇండస్ట్రీ మీట్’లో మంత్రులు బుగ్గన, మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులనేది ఒక మిస్ కమ్యూనికేషన్ అని వ్యాఖ్యానించారు మంత్రి బుగ్గన. పరిపాలన విశాఖపట్నం నుంచే జరుగుతుందని.. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను బట్టి చూస్తే రాజధానిగా విశాఖ ఉత్తమంగా ఉంటుందన్నారు. అక్కడ అభివృద్ధికీ బాగా అవకాశం ఉంటుందని.. ఇప్పటికే పోర్ట్, కాస్మొపాలిటన్ కల్చర్, వాతావరణం ఉందన్నారు. కర్నూలు రెండో రాజధాని కాదని.. అక్కడ హైకోర్టు ఉంటుంది అన్నారు. కర్ణాటకకు ధార్వాడ, గుల్బర్గాలో హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయని.. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉండాలని భావించామన్నారు. 1937నాటి శ్రీబాగ్ ఒప్పందం హైకోర్టు ఒకచోట, రాజధాని మరో చోట ఉండాలని చెబుతోందని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలోని బెళగాంలో ఒక విడత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని మంత్రి గుర్తు చేశారు. ఒక సెషన్ గుంటూరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని.. మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాగే.. విశాఖను ఐటీ రంగాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా.. అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం ఉండేలా చూడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మికంగా ప్రపంచానికే రాజధాని అన్నారు మంత్రి బుగ్గన.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు బుగ్గన. రవాణా భారాన్ని తగ్గించడానికి ఇన్‌లాండ్ వాటర్‌పాలసీ తీసుకొస్తామని.. 2029 నాటికి 10 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యానికి చేరతామని తెలిపారు. నీతి ఆయోగ్ ప్రకటించిన పెట్టుబడులకు అనువైన వాతావరణమున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగోస్థానంలో ఉందని వివరించారు.. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో దక్షిణ భారతంలోనే మొదటి బల్క్‌డ్రగ్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
అంతేకాదు మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఇన్ఫోసిస్ వెయ్యిమంది ఉద్యోగులతో ప్రారంభమవుతోందని.. దేశంలోని ప్రతి వందమంది ఐటీ ఉద్యోగుల్లో 15 మంది తెలుగువారు ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ ఐటీలోనూ అగ్రగామి నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Latest
Andhra Pradesh News
and