వరంగల్‌లోనూ నూతన సెక్రటేరియట్.. నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్ !

Warangal Secretariat Setting: వరంగల్‌లో కొత్త సచివాలయం నేడు ప్రారంభం కానుంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తున్నారు. కొత్త సచివాలయం హైదరాబాద్‌లో కదా ఉంది.. మరి వరంగల్‌లో ప్రారంభించటమేంటని అనుకుంటున్నారా..! అవునండి వరంగల్‌లోనూ కొత్త సెక్రటేరియట్ నిర్మించారు. కాకపోతే అది నిజమైన సెక్రటేరియట్ కాదు. సచివాలయం నమునాతో ఏర్పాటు చేసిన సెట్టింగ్.

ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా స్థానిక అజంజాహి మైదానంలో సుమారు రూ. 30 లక్షల ఖర్చుతో నూతన సెక్రటేరియట్ నమునాతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు.

అలాగే ఈనెల 18న శివరాత్రి ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలు ఇక్కడే పూజలు చేసేలా మరో రూ. 30 లక్షలతో భారీ శివలింగం, భక్తులు జాగారం చేసేందుకు గాను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తు్నారు. ఇవాళ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయకరావులతో కలిసి ఎమ్మెల్యే ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. సెక్రటేరియట్ నమునాతో వేసిన సెట్టింగ్ వరంగల్ తూర్పు నియోజవర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ఏప్రిల్‌ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. సచివాలయంలోని 6వ అంతస్తును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సమీకృత కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగా అనుకుంది. అందుకు చకచక ఏర్పాట్లు కూడా చేసింది. పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం కూడా పంపారు. అయితే.. శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

మరో ముహూర్తం కోసం సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమీకృత కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆయన జయంతి రోజే దాన్ని ప్రారంభించాలని తాజాగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 14నే ప్రారంభించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆరోజునే ప్రారంభించేందుకు సీఎం మెుగ్గు చూపారని సమాచారం.

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *