విదేశాల్లో ఉన్నత విద్యకు డిమాండ్.. గత పదేళ్లలో ఎంత మంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారంటే!

విదేశాల్లో ఉన్నత విద్య (Higher Education) చాలా మంది విద్యార్థుల కల. అయితే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఉన్నత విద్య సాకారం కోసం ఎక్కువ మంది విద్యార్థులు (Students) స్కాలర్‌షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్‌ (Education Loans)పై ఆధారపడుతుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు విరివిగా ఎడ్యుకేషన్స్ లోన్స్ ఇస్తుండడంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. గత పదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఎడ్యుకేషన్ లోన్స్ ఎంత మంది విద్యార్థులు తీసుకున్నారు తదితర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* మెడిసిన్ కోసం 42,364 విద్యార్థులకు లోన్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు ఉన్నత విద్య కోసం విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో మొత్తంగా 4,61,017 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. వీరిలో 42,364 మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఎడ్యుకేషన్ లోన్ పొందారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

* 2012-13లో 22,200 మంది విద్యార్థులకు

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. 2012-13 కాలంలో మొత్తంగా 22,200 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్స్ పొందారు. 2020 వరకు ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో 56,930 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్స్ నుంచి లబ్ది పొందారు. 2019లో 69,183 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్ పొందారు. ఈ సంఖ్య 2021లో 69,898గా ఉంది. దీన్ని బట్టి ఏటేటా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే విద్యార్థుల సంఖ్యలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి :  జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అడ్మిట్‌కార్డ్స్‌ జారీ ఎప్పుడంటే?

* ఎడ్యుకేషన్ లోన్స్‌లో పదేళ్ల నుంచి పెరుగుదల

కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ విదేశాల్లో మెడిసిన్ చడవడం కోసం విద్యార్థులకు మంజూరు చేసిన ఎడ్యుకేషన్స్ లోన్స్ క్రమంగా పెరిగాయి. గత 10 ఏళ్లలో విద్యార్థులకు అందజేసిన ఎడ్యుకేషన్ లోన్స్ విలువ రూ.39,268.82 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల కోసం ఇప్పటి వరకు రూ.1,790.16 కోట్ల విలువైన లోన్స్ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.

* 2018-22 వరకు మెడిసిన్ ఎడ్యుకేషన్స్ లోన్స్

2018-19 మధ్య మెడిసిన్ చదవడానికి విద్యార్థులు రూ.237.13 కోట్లు రుణం తీసుకున్నారు. అదే విధంగా 2019-20 లో రూ.298.97 కోట్లు, 2020-21 లో రూ.243.64 కోట్లు, 2021-22లో రూ.289.82 కోట్లు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ తీసుకున్నారు. 2012 నుంచి విద్యార్థులకు మంజూరు చేస్తున్న ఎడ్యుకేషన్ లోన్స్ క్రమంగా పెరుగుతున్నాయి. 2012-13లో విదేశాల్లో మెడిసిన్ చదువుకోవడానికి తీసుకున్న రుణాలు రూ.51.86 కోట్లు కాగా, 2021-22 నాటికి రూ.289,82 కోట్లకు పెరిగాయి. కెరీర్ 360 ప్రకారం ఇది ఒక దశాబ్దంలో 459 శాతం పెరుగుదల ఉంది.

* 2012-22 మధ్య లోన్ పొందిన విద్యార్థుల సంఖ్య

2012 నుంచి 2022 వరకు విదేశాల్లో చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ పొందిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 2012-13లో 22,200 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్స్ పొందగా, 2013-14లో ఈ సంఖ్య 29,373గా ఉంది. 2014-15లో 38,047, 2015-16లో 45,197, 2016-17లో 50,029, 2017-18లో 56,896, 2018-19లో 60,628, 2019-20లో 69,183, 2020-21లో 56,930, 2021-22 లో 69,898 మంది విద్యార్థులు లోన్స్ పొందారు.

* సింగిల్ విండో సిస్టమ్‌

2015లో కేంద్రప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యాలక్ష్మి పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీంతో ఎడ్యుకేషన్ లోన్స్ కోసం దరఖాస్తు ప్రక్రియను ఇది సులభతరం చేసింది. ఈ వెబ్‌సైట్ విద్యార్థుల రుణాలపై మొత్తం సమాచారాన్ని సేకరిస్తుంది. దరఖాస్తు, రుణాల ట్రాకింగ్ కోసం విద్యార్థులకు ఇది సింగిల్ విండో సిస్టమ్‌గా పనిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *