హైదరాబాద్‌లో దారుణం.. కియా కార్లతో రేసింగ్.. మహిళ ప్రాణం తీసిన విద్యార్థులు..!

హైదరాబాద్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థుల సరదా ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రేసింగులకు పాల్పడి.. ఓ మహిళ ప్రాణం తీశారు. మహిళపైకి కారును దూసుకెళ్లి ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. బిజినెస్​ కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు కార్ల రేసింగ్​ పెట్టుకున్నారు. మూడు కార్లలో విద్యార్థులు రేసింగ్​కు బయలుదేరారు.

అయితే వాటిలో ఓ కారు అటు వైపుగా వస్తున్న టూవీలర్​ను ఢీకొట్టింది. దీంతో బండి మీద ఉన్నవారు రోడ్డుపై పడిపోయారు. వాటిలోని మరో కారు వెనకాలే వస్తూ.. మహిళపై నుంచి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా, శంకర్​పల్లి మండలంలోని జన్వాడ గ్రామానికి చెందిన నర్సింహులు, శాంతమ్మ (55) దంపతులు మంగళవారం సాయంత్రం టూవీలర్​పై శంకర్​పల్లిలో ఒక బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగివస్తున్నారు.

అయితే.  మీర్జాగూడ గ్రామం, కొల్లూరు గేటు సమీపంలో వారి వెహికిల్​ను వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. వాళ్లిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అంతలోనే వెనుక నుంచి వచ్చిన మరో కారు శాంతమ్మపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గాయపడిన నర్సింహులును ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సుజిత్​రెడ్డిని స్థానికులు పట్టుకుని కొట్టారు. రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపిసి సెక్షన్‌ 304ఎ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), 337 (నిర్లక్ష్యంతో మానవ ప్రాణాలకు హాని కలిగించేలా) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి శివ కుమార్ తెలిపారు.

కారు నడుపుతున్న ఇద్దరు విద్యార్థులుమద్యం మత్తులో రేసింగ్ పోటీని నిర్వహించారని, ఇది ర్యాష్ మరియు ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు దారితీసిందని, ఫలితంగా మహిళ చనిపోయిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. అయితే, సంఘటన సమయంలో డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నారా?  లేదా ? అనే విషయాన్ని నిర్ధారించడానికి తమకు  ఆధారాలు ఏవీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *