Who Is Chetan Sharma: అసలు ఈ చేతన్ శర్మ ఎవరు ? బిసిసిఐలో సెలెక్టర్స్ కమిటీ చైర్మన్ ఎలా అయ్యాడంటే..

Who Is Chetan Sharma: చేతన్ శర్మ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. జీ న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తో చేతన్ శర్మ పేరు ఒక్కసారిగా హైలైట్ అయింది. ఇప్పటివరకు బిసిసిఐ సెలెక్టర్స్ కమిటీ చీఫ్ గా ఉన్నదానికంటే ఎన్నోరెట్లు ఎక్కువ చేతన్ శర్మ పేరు లైమ్ లైట్ లోకి వచ్చేలా చేసింది జీ న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు ? బిసిసిఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి, విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మక మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు జీ న్యూస్ సీక్రెట్ కెమెరాకు వెల్లడించి బిసిసిఐ బాగోతం అంతా బయటపెట్టాడు. దీంతో చేతన్ శర్మ పేరుకు ఎక్కడా లేని ప్రచారం వచ్చి పడింది.

చేతన్ శర్మ.. ఇంతకీ ఈ చేతన్ శర్మ ఎవరు ? గతంలో టీమిండియాలో చేతన్ శర్మ స్థానం ఏంటి ? బిసిసిఐ సెలెక్టర్స్ కమిటీ చీఫ్ ఎలా అయ్యాడు ? ఇప్పుడు మన దేశమే కాదు… యావత్ ప్రపంచం గూగుల్ చేస్తోన్న సందేహాలు ఇవి. ఈ నేపథ్యంలో అసలు ఈ చేతన్ శర్మ ఎవరనేది తెలుసుకునే తెలుసుకుందాం రండి.

1966, జనవరి 3న జన్మించిన చేతన్ శర్మ.. 1983 లో తన 17వ ఏట పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కాలుపెట్టాడు. ఆ తరువాతి ఏడాదే వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. టీమిండియా తరపున వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచులు ఆడిన చేతన్ శర్మ.. ఫాస్ట్ బౌలర్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. 

ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్

1984 లో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆ దేశంపైనే జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా చేతన్ శర్మ ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభించాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. తొలి ఓవర్‌లో 5వ బంతికే మోహిసిన్ ఖాన్‌ని ఔట్ చేసి.. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసిన 3వ ఇండియన్ క్రికెటర్‌గానూ చేతన్ శర్మ రికార్డు సాధించాడు.

తొలి రికార్డు చేతన్ శర్మ పేరు మీదే..

వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఆటగాడిగా చేతన్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. 1987 లో జరిగిన రిలయన్స్ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతన్ శర్మ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.  

చేతన్ శర్మకు క్రికెట్ గురూ ఎవరో కాదు..

చేతన్ శర్మకు క్రికెట్ గురూ ఎవరో కాదు.. స్వయంగా కపిల్ దేవ్‌కి కూడా క్రికెట్‌లో శిక్షణ ఇచ్చిన ద్రోణాచార్య అవార్డు విన్నర్ దేశ్ ప్రేమ్ ఆజాద్ వద్దే చేతన్ శర్మ క్రికెట్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం దేశ్ ప్రేమ్ ఆజాద్ ఈ తరం ఆటగాళ్లయిన వెంకటేశ్ అయ్యర్, శార్ధూల్ థాకూర్‌లకి కోచింగ్ ఇస్తుండటం విశేషం.

శ్రీలంక పర్యటనలో 3 టెస్ట్ మ్యాచుల్లో 14 వికెట్లు

1985 లో శ్రీలంక టూర్లో 3 టెస్ట్ మ్యాచుల్లో 14 వికెట్లు తీసి సూపర్ ఫాస్ట్ బౌలర్‌గా చేతన్ శర్మ జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 

ఇంగ్లండ్ గడ్డపైనా తిరుగులేని రికార్డు

చేతన్ శర్మ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే రికార్డు కూడా ఉంది. 1986 లో ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా ఆ జట్టును 2-0 తేడాతో భారత్ మట్టికరిపించింది. ఆ రెండు మ్యాచుల్లో చేతన్ శర్మ మొత్తం 16 వికెట్లు తీయడం విశేషం. అందులో ఒక మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లాండ్ లో ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా చేతన్ శర్మ రికార్డును ఇప్పటివరకు ఎవ్వరూ బీట్ చేయలేదు. 

కెరీర్ ఎప్పుడు ముగిసిందంటే..

1996 లో చేతన్ శర్మ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2004 లో హర్యానాలోని పంచకులలో  ఫాస్ట్ బౌలింగ్ క్రికెట్ అకాడమిని స్థాపించినప్పటికీ… 2009 లో దాన్ని కూడా మూసేసి ఎక్కువ కాలంపాటు క్రికెట్ కామెంటేటర్‌గానే కొనసాగాడు. యశ్‌పాల్ శర్మ అనే మరో సీనియర్ క్రికెటర్‌కి చేతన్ శర్మ సమీప బంధువు అవుతాడు. 

రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్న చేతన్ శర్మ

సమాజ్ వాది పార్టీలో చేరిన చేతన్ శర్మ.. 2009 లో ఫరిదాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అనంతరం బీజేపిలో చేరి స్పోర్ట్స్ సెల్ కన్వినర్ అయ్యాడు.

బిసిసిలోకి చేతన్ శర్మ..

2020 డిసెంబర్ లో చేతన్ శర్మ బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియామకం జరిగింది. అయితే 2022 నవంబర్ లో జరిగిన వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ తరువాత అతడిని ఆ స్థానం నుంచి తప్పించారు. ఆ తరువాత బిసిసిఐ క్రికెట్ అడ్వైజరీ కమిటి చేతన్ శర్మనే తిరిగి బిసిసిఐ సెలెక్టర్స్ కమిటి చైర్మన్ గా నియమిస్తూ గత నెల.. అంటే 2023 జనవరి 7న ఉత్తర్వులు జారీచేసింది. దీంత చేతన్ శర్మ మరోసారి ఆ పదవిని చేపట్టాడు. ఇప్పుడిలా జీ న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో బిసిసిఐలో జరుగుతున్న బాగోతాన్ని పూసగుచ్చినట్టుగా వివరించి మరో సంచలనానికి కారణం అయ్యాడు. అదండీ చేతన్ శర్మ కథాకమామిషు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *