అమెరికాను వణికిస్తున్న గూడ్స్ రైలు ప్రమాదం.. వేలాది జీవులు మృత్యువాత, ఎంత దూరం పరుగెత్తాలి?

అమెరికాలోని ఒహియో (Ohio)లో గూడ్స్‌ రైలు బోల్తాపడిన ఘటన ఆ ప్రాంతాన్ని వణికిస్తోంది. ప్రమాదం అనంతరం మంటలు చెలరేగి కొన్ని బోగీలు తగలబడ్డాయి. కిలోమీటర్ల మేర విష వాయువులు కమ్ముకున్నాయి. నీరు, నేల క్రమంగా విషంగా మారుతోంది. ఇప్పటికే జంతువులు, జలచరాలు వేల సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. అక్కడ కొన్ని కిలోమీటర్ల పరిధిలో జనం జలాశయాలు, బోర్లలోని నీటిని తాగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆకాశంలో భయానక విష పదార్థాలు దట్టమైన నల్లటి పొరలా ఏర్పడ్డాయి. విమానంలో నుంచి తీసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రమాదం తర్వాత వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు విష పదార్థాలు అంతకంతకూ వ్యాపిస్తుండటంతో ప్రజలు దూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 10 మైళ్లు, 50 మైళ్లు, 100 మైళ్లు.. ఇంకెంత దూరం పరుగెత్తాలి? అంటూ బాధితులు ఆవేదనా భరితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఘటనపై అమెరికా ప్రభుత్వం స్పందించిన తీరు పైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ప్రమాదం వాషింగ్టన్‌లో జరిగితే, సహాయక చర్యలు మరోవిధంగా ఉండేవని కొంత మంది బాధితులు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తూ తమ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

అసలేం జరిగింది?

ఒహియో – పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్‌ పాలస్టైన్‌ అనే గ్రామం వద్ద ఫిబ్రవరి 4న ఓ గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైంది. 50 బోగీలు పట్టాలు తప్పాయి. 150 బోగీలతో మాడిసన్‌ నుంచి పెన్సిల్వేనియాలోని కాన్వేకు వెళ్తున్న ఈ రైలులో 11 బోగీల్లో వినైల్‌ క్లోరైడ్‌, బ్యూటైల్‌ అక్రలేట్‌ లాంటి ప్రమాదకర కెమికల్స్‌ను తరలిస్తున్నారు. ప్రమాదం అనంతరం ఆ బోగీల్లో మంటలు చెలరేగాయి. వినైల్‌ క్లోరైడ్‌ను గ్యాస్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉంటాయని అమెరికా నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ హెచ్చరించింది.

ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం మేరకు వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులను అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గర్లోని నదులు, కాలువలోని నీటిని కూడా పరీక్షల కోసం సేకరిస్తున్నారు.

ఈ భయానక ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన విష వాయువులు వాతావరణంలో కలిశాయి. అక్కడి ప్రజలను బాటిల్‌లోని నీటినే మాత్రమే తాగాలని ఒహియో రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌ సూచించారు. ఈ ప్రమాదం కారణంగా దీర్ఘకాలిక సమస్యలు ఉండే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెర్నోబిల్ ఘటనతో దీన్ని పోలుస్తున్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *