ఎయిరిండియా: రికార్డు సంఖ్యలో విమానాల కొనుగోలుతో అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసరబోతోందా?

బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థల నుంచి 470 కొత్త విమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు.

2011లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 460 విమానాల కొనుగోలు ఒప్పందం కంటే ఇది పెద్దదని.. ఎయిర్ ఇండియా నెట్‌వర్క్ విస్తరణ, ఫ్లీట్ ఆధునికీరణకు ఇది మార్గమని ఆయన వెల్లడించారు.

సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియాను రెండేళ్ల కిందట టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అనంతరం ఎయిర్ ఇండియాకు చెందిన పాత విమానాలను పక్కనపెట్టింది. అయిదేళ్లలో కొత్త విమానాల కొనుగోలుకు ప్రణాళిక వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ ఇండియా కొత్త విమానాలు గాల్లోకి ఎగురుతాయి.

ఎయిర్ ఇండియా కుదుర్చుకున్న ఈ భారీ ఒప్పందం భారత విమానయాన మార్కెట్‌లో అందరికంటే పైనుండాలన్న ఆ సంస్థ ఆకాంక్షలకు, ప్రపంచవ్యాప్తంగా సేవలు మరింత విస్తరించేందుకు కల్పించుకుంటున్న అవకాశాలకు సూచిక అని విశ్లేషకులు చెప్తున్నారు.

‘‘ఎయిర్ ఇండియా కొత్త ఆర్డర్ నేరుగా తన ఫ్లీట్‌ను లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, స్టార్ అలయన్స్‌లోని ఇతర వైమానిక సంస్థలతో కలుపుతుంది’’ అని విమానయాన రంగ నిపుణుడు మార్క్ మార్టిన్ చెప్పారు. స్టార్ అలయన్స్ ప్రపంచంలోనే విమానయాన సంస్థల కూటమి. విమానయాన రంగంలో గల్ఫ్ దేశాల సంస్థల ఆధిపత్యాన్ని స్టార్ అలయన్స్ తట్టుకోవడానికి కూడా ఈ కొనుగోలు దోహదపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతీయ ప్రయాణికులు యూరప్ దేశాలుకు, అమెరికా, ఇతర కొన్ని దేశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎతిహాద్, ఇతర మధ్యప్రాచ్య దేశాల విమానయాన సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎయిర్ ఇండియా కొత్త విమానాలు వచ్చాక ఆ పరిస్థితి మారొచ్చని మార్టిన్ అభిప్రాయపడుతున్నారు.

ఏ350 లాంటి వెడల్పైన పరిమాణం గల విమానాలను కొనుగోలు చేయడం ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లకు, భారత్‌కు మధ్యలో నాన్-స్టాప్ విమానాలను నడిపేందుకు వీలవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఎయిరిండియా మరింత పుంజుకోవచ్చు. విదేశాలలో నివసించే ఎక్కువ మంది ప్రవాస భారతీయులకు సేవలందించేందుకు ఇవి లాభాదాయకమైన మార్గాలు.

కానీ, గల్ఫ్ విమానయాన సంస్థల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడం అంత తేలికైన విషయం కాదని, ధరల యుద్ధాన్ని ప్రారంభించే సామర్థ్యం ఉండాలని భారత్‌ ఏవియేషన్‌ను పరిశీలించే వెబ్‌సైట్ లైవ్‌ఫ్రమ్ఏలాంజ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అజయ్ అవతానీ అన్నారు.

  • స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్: రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్ చూస్తే కళ్లు పోతాయా? హైదరాబాద్ యువతి సమస్యపై డాక్టర్ ట్వీట్ వైరల్
  • పులులను బలి తీసుకుంటున్నది ఎవరు? ఒక్క రాష్ట్రంలోనే ఏడాదిలో 38 పులులు, 87 చిరుతల మృతి

కేబిన్లను సరిగ్గా నిర్వహించడం లేదని, వినోద సాధనాలు పనిచేయడం లేదని, ఛార్జింగ్ పాయింట్లు పగిలిపోయాయని ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల నుంచి ఎయిరిండియాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కొత్త విమానాల రాకతో ఎయిరిండియా వినియోగదారులు అప్‌గ్రేడెడ్ అనుభవాన్ని పొందుతారని అవతానీ అన్నారు.

అయితే, మానవ వనరుల కొరత, శిక్షణ పొందిన సిబ్బంది దొరకడం ఎయిరిండియాకు సమస్యలుగానే ఉండనున్నాయని చెప్పారు.

దశాబ్దాల కిందట ఎయిరిండియా సంస్థను టాటాలు నెలకొల్పారు. 1950లో దీన్ని ప్రభుత్వం జాతీయికరణ చేసింది. సేవల విషయంలో ప్రపంచ ప్రమాణాల సంస్థగా ఎయిరిండియాను పరిగణించే వారు.

కానీ, ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ సంస్థను సరిగ్గా నిర్వహించలేకపోవడంతో ఎయిరిండియా రుణ భారం కుప్పలు తెప్పలుగా పెరిగిపోయింది. తన మునపటి కీర్తి, ప్రతిష్టలను మళ్లీ పునరుద్ధరించాలని ప్రయత్నించి విఫలమయ్యాయి ప్రభుత్వాలు. చివరికి 68 ఏళ్ల తర్వాత ఈ విమానయాన సంస్థ తన సొంత గూటికే చేరింది. 2021లో 2.4 బిలియన్ డాలర్లకు ఎయిరిండియా సంస్థను తిరిగి టాటాలు సొంతం చేసుకున్నారు.

ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణపై విమర్శలు చేస్తున్న వారి నోళ్లను ఈ ఆర్డర్లు మూపిస్తాయని ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ బీబీసీతో అన్నారు.

తన సామర్థ్యాన్ని పూర్తిగా వెలికితీసేందుకు, ఏ350 లాంటి ఐదవ తరం విమానాలను సమర్థవంతంగా నడిపేందుకు, ఈ విమానయాన సంస్థ తన కార్యకలాపాలను వేగవంతంగా ఆధునీకరించాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లను, నిర్వహణను, మానవ వనరుల సామర్థ్యాలను ఆధునీకరించాలని నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ వారు విజయవంతమైతే, ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి వీరు భారత ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతారని మార్టిన్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటుకునేందుకు ఎయిరిండియా భారత ప్రయాణికులపై మాత్రమే కాకుండా అంతకు మించి ఫోకస్ చేయాల్సి ఉందని, అనుసంధాన ట్రాఫిక్‌ను మరింత పెంచుకోవాల్సి ఉందని అవతానీ అన్నారు. దీని కోసం, ఎయిరిండియా తన రూట్ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. అంతేకాక, మౌలిక సదుపాయాలను భారత్ మెరుగుపరుచుకోవాలి.

  • భారత మహిళా క్రికెటర్ల కష్టాలు, పడే పాట్లు వింటే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి
  • ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?

పెద్ద సంఖ్యలో ప్రయాణికుల ట్రాఫిక్‌ను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం భారత్ వద్ద లేదని శీతాకాలంలో దిల్లీ, ముంబై విమానశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ వద్ద కనిపించే పెద్ద పెద్ద క్యూలు, ఎదురు చూపులే నిదర్శనంగా నిలిచాయి.

మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు భారత్ వచ్చే ఐదేళ్లలో కొత్తగా 80 విమానశ్రయాలను ఏర్పాటు చేస్తోంది.

కరోనా మహమ్మారి తర్వాత భారత విమానయాన మార్కెట్ వేగంగా కోలుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వార్షికంగా దేశీయ ట్రాఫిక్ 48.9 శాతం పెరిగింది. డిసెంబర్ 2022లో 12.2 కోట్ల మందికి పైగా భారతీయులు ఇంటర్నల్ ఫ్లయిట్స్‌లో ప్రయాణాలు చేసినట్టు తాజా డేటా చెబుతోంది.

వచ్చే రెండేళ్ల కోసం 1,500 నుంచి 1,700 విమానాలను కొనుగోలు చేసేందుకు దేశీయ విమాన సంస్థలు ఆర్డర్ పెట్టుకోవడంతో ప్రపంచ పౌర విమానయాన వృద్ధికి భారత్ కూడా కీలకమైనదిగా నిలవనుందని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా(సీఏపీఏ ఇండియా) అంచనావేసింది.

ఇవి కూడా చదవండి:

  • మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?
  • వాలంటైన్స్ డే: డేటింగ్ చేయటం, ప్రేమలో పడటం నేర్పించే ‘మాక్ డేట్’ సర్వీసులు
  • మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? సుప్రీంకోర్టులో కేసు ఏమిటి?
  • బీబీసీపై ఐటీ దాడుల విషయంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పాయి?
  • బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *