కూకట్‌పల్లి బస్సుల దగ్ధం కేసులో ములుపు.. డ్రైవరే నిప్పుపెట్టాడు

Kukatpally: కూకట్‌పల్లి బస్సుల దగ్ధం కేసులో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 12న అర్థరాత్రి కూకట్‌పల్లిలోని రంధాముని చెరువు కట్ట వద్ద పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగడంతో మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం కారణంగా ఈ ఘటన జరిగిందా? లేదా ఎవరైనా కావాలని నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల విచారణలో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ పసుపులేటి వీరబాబు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. డ్యూటీకి రాలేదనే కోపంతో యజమాని కృష్ణారెడ్డి తన సోదరుడి కుమారుడైన యశ్వంత్ రెడ్డితో కలిసి డ్రైవర్ వీరబాబును గదిలో బంధించారు. అనంతరం ఇంజిన్ బెల్టు, కొబ్బరి మట్టలతో చితకబాదారు. వీరబాబు బంధువు ఇంటికి వెళ్లి మరీ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో యజమానిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గ్యారేజీలో ఉన్న బస్సులకు వీరబాబు నిప్పు పెట్టాడు.

అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో ఒక బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించగా.. మిగతా బస్సులకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యజమాని, సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో తానే బస్సులకు నిప్పు పెట్టినట్లు వీరబాబు చెప్పడంతో.. అతడిని అరెస్ట్ చేశారు. అలాగే తనను కొట్టినట్లు నిందితుడు కూడా ఫిర్యాదు చేయడంతో.. దాడికి పాల్పడ్డ యజమాని కృష్ణారెడ్డితో పాటు యశ్వంత్ రెడ్డినిపై కూడా కేసులు నమోదు చేశారు.

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురానికి చెందిన వీరబాబు రెండు నెలలుగా భారతి ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న ఆదివారం డ్యూటీకి వెళ్లాలని వీరబాబుకు యజమాని సమాచారం ఇచ్చాడు. అయితే తాను ఇంటికి వెళ్లాల్సి ఉందని, డ్యూటీకి రావడం కుదరదని చెప్పగా.. డ్యూటీకి రావాల్సిందేనని యజమాని తెగేసి చెప్పాడు. ఈ సమయంలో యజమాని, డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కోపంలో డ్రైవర్‌పై యజమాని దాడికి పాల్పడగా.. పగ తీర్చుకునేందుకు డ్రైవర్ బస్సులకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. భారతి ట్రావెల్స్ గ్యారేజీలో రోజు 11 బస్సుల వరకు నిలిపి ఉంచుతారు. ఘటన జరిగిన రోజు మూడు బస్సులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *