ఢిల్లీ టెస్టుకి భారత్ జట్టులో రెండు మార్పులు.. మాజీ క్రికెటర్ జోస్యం

India’s Playing XI For Delhi Test : ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టుకి భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ గురువారం జోస్యం చెప్పాడు. నాగ్‌పూర్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లోనూ భారత్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి చేరాలంటే.. ఆస్ట్రేలియాని ఈ రెండు టెస్టులోనూ తప్పక ఓడించాల్సి ఉంది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం ఉదయం 9:30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఆడతారని వసీం జాఫర్ అంచనా వేశాడు. అలానే కేఎల్ రాహుల్‌పై వేటు పడబోతోందని అతను జోస్యం చెప్పాడు. నాగ్‌పూర్ టెస్టులో 71 బంతులాడిన రాహుల్ కేవలం 20 పరుగులు చేసి ఔటైపోయిన విషయం తెలిసిందే. మరోవైపు శుభమన్ గిల్ జనవరి నెలలో నాలుగు సెంచరీలు బాదేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండగా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. గిల్‌ని తొలి టెస్టులో పక్కన పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

అలానే గాయంతో తొలి టెస్టుకి దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ కూడా తుది జట్టులోకి వస్తాడని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడటం లాంఛనమే. నాగ్‌పూర్ టెస్టుతో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సూర్య.. 20 బంతులాడి 8 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చే సూచనలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మార్పులు మాత్రమే భారత జట్టులో రెండో టెస్టుకి జరిగే అవకాశం ఉన్నట్లు వసీం జాఫర్ వెల్లడించాడు.

రెండో టెస్టుకి వసీం జాఫర్ ఎంపిక చేసిన తుది జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *