కాకినాడ జిల్లా పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకులకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఝలక్ ఇచ్చారు. పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్‌పై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చినరాజప్ప మళ్లీ పోటీ చేస్తారని ప్రకటించారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా మూడోసారి కూడా ఆయననే గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే, పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారికి తప్పక న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
మరోవైపు వేల కోట్ల రూపాయిల ఆస్తిపరుడైన సీఎం జగన్.. పేదలకు, ధనికులకు మధ్య పోరాటం అంటూ కొత్త వేషాలు వేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల మధ్య.. కుల, మత, ప్రాంతాల చిచ్చుపెట్టి చలికాసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన ఘరానా దొంగ జగన్‌రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిలువు దోపిడీతో ప్రజలందర్నీ దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల రక్తం తాగే జలగలు వైసీపీ నేతలని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల్ని ఇబ్బందిపెడుతూ ఆనందపడే సైకో ముఖ్యమంత్రి జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్పిన అబద్దం మళ్లీ చెప్పని జగన్.. ఆస్కార్ అవార్డుకు అర్హుడని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాల్లో కూడా ఇసుక దొరకని చిదంబర రహస్యం ఏంటని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు.
పదో తరగతి ఫెయిల్ అయిన సీఎం జగన్.. కళ్యాణమస్తు పథకం అమలుకు మాత్రం పదో తరగతి పాస్ కావాలంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కట్టిన టిడ్కో ఇళ్లు కూడా లబ్ధదారులకు ఇవ్వలేని సీఎం.. పేదల కోసం చేసిన సంక్షేమం ఏంటని నిలదీశారు. ఇక, రాష్ట్రంలో రూ. 2 వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆఫ్రికాకు అక్రమ రవాణా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.