ప్రస్తుత కాలంలో టెక్నాలజీ సంచలనం చాట్‌జీపీటీ(ChatGPT) సేవలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. అన్ని రంగాలు ఈ టెక్నాలజీ సేవలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. భారత రైతులకు కూడా చాట్‌జీపీటీ సేవలు అందించాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. చదువు లేని వారు మాటల ద్వారా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకునేలా చేయాలని భావిస్తోంది. మరోపక్క చాట్‌జీపీటీని కూడా మరింత మెరుగ్గా చేసే ప్రయత్నాల్లో OpenAI కంపెనీ ఉంది. ఇటీవల అమెరికాలో 20 డాలర్లకి నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో ChatGPT ప్లస్ సేవలను ప్రారంభించింది. చాట్‌జీపీటీ స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వేగవంతమైన ప్రతిస్పందన, కొత్త ఫీచర్‌లకు ముందస్తుగా యాక్సెస్, పీక్ అవర్స్‌లో మరిన్ని సేవలను పొందే అవకాశం కలుగుతాయి.
* టర్బో మోడ్ ఎలా పని చేస్తుంది?
చాట్‌జీపీటీ ప్లస్ వినియోగదారుల రిపోర్ట్ మేరకు.. OpenAI ఇటీవల చాట్‌జీపీటీ ప్లస్ సభ్యుల కోసం Turbo అనే కొత్త మోడ్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు మెరుగైన వేగాన్ని అందిస్తుంది. ఓ చాట్‌జీపీటీ ప్లస్ యూజర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ టర్బో మోడ్ ఆల్ఫా ఫేజ్‌లో ఉంది, చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ప్లస్ వినియోగదారులకు ఈ మోడ్ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా యాక్టివేట్ అయింది.
ప్రస్తుతం ChatGPT డిఫాల్ట్ మోడ్, టర్బో మోడ్‌ను అందిస్తోంది. చాట్‌జీపీటీ ప్లస్ వినియోగదారులు రెండు మోడ్‌ల మధ్య మారవచ్చు. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకోని సాధారణ వినియోగదారులు డిఫాల్ట్ మోడ్‌ను మాత్రమే యాక్సెస్ చేయగలరు. Redditలో వచ్చిన పోస్ట్‌లను పరిశీలిస్తే కొందరు టర్బో మోడ్ వేగంగా రెస్పాన్స్ అందిస్తుందని, కానీ తక్కువ నాణ్యతతో కూడిన సమాచారం ఉంటోందని తెలిసింది. అయితే కొందరు టర్బో మోడ్‌ను స్పీడ్‌గా రెస్పాన్స్ ఇవ్వడానికే డిజైన్ చేశారని పేర్కొంటున్నారు.
* కొందరు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు
డిఫాల్ట్ మోడ్ కంటే ఎక్కువ ఫలితాలను అందించడంలో టర్బో మోడ్ విఫలమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. దీనికి విరుద్ధంగా టర్బో మోడ్ అనేది డిఫాల్ట్ మోడ్‌కి ఎన్‌హ్యాన్స్‌డ్ వెర్షన్ అని కొందరు అంటున్నారు. టర్బో మోడ్‌కి మినిమల్ కాంప్యుటేషనల్ రిసోర్సెస్ సరిపోతాయని, ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్ కోసం డెవలప్ చేశారని సమర్థిస్తున్నారు.
* రైతులకు చాట్‌జీపీటీ సేవలు?
భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక ప్రకారం.. భారతీయ రైతులు అనేక ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి సహాయం చేసేలా చాట్‌జీపీటీని వాట్సాప్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం.. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ(Meity)లోని టీమ్ భాషిణి, చాట్‌జీపీటీ ద్వారా నడిచే వాట్సాప్ చాట్‌బాట్‌ను పరీక్షిస్తోంది.
చాట్‌జీపీటీ పవర్డ్ వాట్సాప్ చాట్‌బాట్ వాయిస్ నోట్స్ ద్వారా వినియోగదారులు పంపిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లలో టైప్ చేయడం గురించి తెలియని భారతీయ రైతులకు ఇది ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో కూడా భారతీయ రైతులు ఇంటర్నెట్‌ని ఉపయోగించి ప్రభుత్వ కార్యక్రమాన్ని యాక్సెస్ చేయడానికి త్వరలో GPT ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించుకోవచ్చని పేర్కొనడం గమనార్హం.