మహా శివరాత్రి: పార్వతి ఒడిలో పవళించిన శివుడు – పురాతన పళ్లికొండేశ్వర ఆలయం విశేషాలు మీకు తెలుసా?

చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు మధ్యలో తిరుపతి నుంచి నాగలాపురం మీదుగా చెన్నై వెళ్లే ఒక హైవే. ఆ పక్కనే రంగురంగుల గోపురం ఉన్న ఒక ఆలయం. ఆ ఆలయంలోకి వెళ్తే గర్భగుడిలో.. పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుడి విగ్రహం కనిపిస్తుంది.

శివాలయాల్లో ఎక్కడైనా శివుడు మనకు లింగాకారంలో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు ఇలా మానవ రూపంలో మిగతా దేవీ దేవతల్లాగే కనిపించడం ఇక్కడ మాత్రమే ఉంది.

ఈ ఆలయం తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు చివర్లోని సురుటిపల్లి గ్రామంలో మరో ఒకటిన్నర కిలోమీటరు వెళ్తే తమిళనాడు వస్తుందనగా రోడ్డు పక్కనే ఆ ఆలయం కనిపిస్తుంది. తమిళనాడులో మొదట వచ్చే ఊతుకోట పట్టణం ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

ఈ ఆలయంలోని శివుడి పేరు పళ్లికొండేశ్వరుడు. పళ్లికొండు అంటే తమిళంలో పడుకోవడం.

ఈ ఆలయం చరిత్రను, పళ్లికొండేశ్వరుడి ఆలయ విశేషాలను ఆలయ ప్రధాన అర్చకుడు కార్తికేశ గురుకుల్ బీబీసీకి వివరించారు.

“1334లో హరిహరబుగ్గ రాయల కాలంలో స్థాపించిన క్షేత్రం ఇది. ఈ శివాలయంలో అన్ని పూజలు శైవం ప్రకారమే జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరుగుతుంది. శివుడు మూలస్థానంగా ఉన్న ఈ ఆలయంలో రామాయణం రాసిన వాల్మీకి తపస్సు చేశాడని, ఆయనను శివుడు అనుగ్రహించాడని చెబుతారు. అందుకే ఇక్కడ శివుడి స్వయంభు లింగం కూడా ఉంది. ఆ లింగాన్ని వాల్మీకేశ్వర స్వామి అంటారు. అదేవిధంగా స్వామివారికి అమ్మవారు కామధేను కల్పతరువు ఉండే ఏకైక క్షేత్రం ఇక్కడ మాత్రమే ఉంది. ఈ గుడిలో అమ్మవారి పేరు సర్వమంగళా దేవి. ఈ ఆలయంలో స్వామి, అమ్మవారి మధ్యలో దక్షిణామూర్తి, ధర్మపత్నీ సమేతంగా ఉండడం విశేషం” అని ఆయన చెప్పారు.

  • కోటె ప్రసన్న వెంకటరమణ ఆలయం: ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?
  • మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? సుప్రీంకోర్టులో కేసు ఏమిటి?

పళ్లికొండేశ్వరుడి ఆలయ ద్వారం తూర్పు దిశగా ఉంటుంది. శివుడు పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఈ ఆలయంలో ఉన్న రూపం వేరే ఎక్కడా లేదన్నారు.

“శివుడు ఈ క్షేత్రంలో అమ్మవారి తొడ మీద విశ్రాంతి తీసుకుంటుంటాడు. శివుడు లింగం ఆకారంలో కాకుండా మూర్తి స్వరూపంగా ఉండే శైవ క్షేత్రం ఇది. దీనిని దక్షిణ కాశిగా చెప్పొచ్చు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన హాలాహలాన్ని లోక కళ్యాణం కోసం స్వీకరించిన శివుడు, ఇక్కడ అమ్మవారి ఒడిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు. శివుడు పవళించి ఉండడం వల్లే ఆయనకు పళ్లికొండేశ్వర అనే పేరు వచ్చింది” అని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచే కాకుండా కర్ణాటక నుంచి ఈ గుడికి భక్తులు వస్తుంటారు. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పళ్లికొండేశ్వరుడికి నీలకంఠేశ్వరుడు అనే పేరు కూడా ఉందని కార్తికేశ చెప్పారు.

“శివుడు విషం తాగిన తర్వాత, అది కడుపులోకి పోకుండా ఉండేందుకు, అమ్మవారు ఇక్కడ పడుకున్న ఆయనకు కంఠ స్పర్శ చేసారట. దాంతో హాలాహలం ఆయన కంఠంలోనే నిలిచిపోయి, నీలంగా మారింది. అందుకే ఇక్కడి స్వామివారికి నీలకంఠేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. లోకకల్యాణం గురించి చెప్పే శివ లీలల్లో దీనిని ఒకటిగా చెబుతారు. భర్తకు భార్య ఎంత ముఖ్యమో చెప్పే తత్వం ఇది” అని కార్తికేశ చెప్పారు.

తమిళనాడు నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఈ ఆలయం పక్కనే ఉన్న రోడ్డు మీదే వెళ్తుంటారు.

“తిరుపతి వెళ్లేటప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేం తిరుపతికి వెళ్తుంటాం. ప్రతి నెలా వస్తుంటాం. మాకు ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీలాంటిది వస్తుంది. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే మేము తిరుపతికి వెళ్తాము. నేను ఎన్నో శివాలయాలకు వెళ్లాను. ఎక్కడైనా శివుడు లింగాకారంలోనే ఉంటాడు. ఇక్కడ ఆయన్ను పడుకున్న రూపంలో చూస్తాం. ఇలా శివుడు ప్రపంచంలో వేరే ఎక్కడా ఉండడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే పళ్లకొండేశ్వరుడిని దర్శించుకోవాలి” అని చెన్నైకు చెందిన ప్రియ చెప్పారు.

  • రామచరిత మానస్: తులసీదాస్ రాసిన ఈ గ్రంథం మహిళలను, దళితులను కించపరుస్తోందా… ఎందుకు వివాదం
  • రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి

ఆలయానికి చేరుకోవడం ఎలా?

చెన్నై నుంచి 60 కి.మీ, శ్రీకాళహస్తి నుంచి 60 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

శ్రీకాళహస్తి నుంచి సురుటిపల్లికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. లేదంటే పిచ్చాటూరు, నాగలాపురం చేరుకుని అక్కడ నుంచి ప్రైవేటు వాహనాల్లో ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు.

తిరుపతికి వచ్చిన భక్తులు అక్కడ నుంచి చెన్నై వెళ్లే బస్సుల్లో సురుటిపల్లి దగ్గర దిగవచ్చు.

ఆలయానికి వచ్చే భక్తులు సమీపంలో ఉన్న కైలాస కోన జలపాతాన్ని, గుణమిట్ట జలపాతాన్ని, నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి ఆలయాన్ని ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు.

ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కంటే దాతలు ఇచ్చే విరాళాల ద్వారానే పళ్లికొండేశ్వర ఆలయంలో ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆలయ ఛైర్మన్ బాలాజీ రెడ్డి బీబీసీకి తెలిపారు.

పళ్లికొండేశ్వర ఆలయానికి గతంలో వచ్చే టూరిజం నిధులతో, యాత్రికుల కోసం వసతి భవనం, టాయిలెట్స్, ప్రహరీ, వాటర్ ట్యాంకు లాంటివి నిర్మించామని, రెండున్నర కోట్ల రూపాయలతో జరిగిన ఈ పనులు ఆలయానికి సంబంధించి పెద్ద అభివృద్ధి అని ఆయన చెప్పారు.

ఆలయానికి ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చే భక్తులే ఉంటారని, చాలా మంది దాతలు విరాళాలు కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. పళ్లికొండేశ్వర ఆలయంలో జరిగిన ఎక్కువ పనులు దాతల విరాళాలతోనే జరిగాయని, కొంతమంది భక్తులు అతిథి గృహాలు కూడా కట్టించారని తెలిపారు.

“తిరుపతి నుంచి తమిళనాడు వెళ్లాలన్నా, తమిళనాడు వాసులు తిరుమల వెళ్లాలన్నా ఈ దారిలోనే వెళ్లాలి. ఆలయం మధ్యలో ఉండడంతో క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం” అని బాలాజీ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

  • మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?
  • వాలంటైన్స్ డే: డేటింగ్ చేయటం, ప్రేమలో పడటం నేర్పించే ‘మాక్ డేట్’ సర్వీసులు
  • మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? సుప్రీంకోర్టులో కేసు ఏమిటి?
  • బీబీసీపై ఐటీ దాడుల విషయంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పాయి?
  • కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *