మొబైల్ యూజర్లను ఇబ్బంది పెడుతున్నస్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: ‘తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్నాం..మీకు క్రెడిట్ కార్డు అప్రూవ్ అయ్యింది..రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయండి.. స్టాక్ టిప్స్ ఇస్తాం..నౌకరీలో మీ ప్రొఫైల్ చూశాం’ .. ఇలా విసిగించే కాల్స్ దేశంలోని ప్రతీ మొబైల్ యూజర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. మొబైల్ యూజర్లు పెస్కీ (అవసరం లేని), స్పామ్, రోబో కాల్స్‌తో విసిగిపోతున్నారు. ‘డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ)’ పెట్టుకున్నా ఇలాంటి కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నామని 92 శాతం మంది రెస్పాండెంట్లు ఓ సర్వేలో వెల్లడించారు. ‘మొబైల్ వాడుతున్న ప్రతీ ఒక్కరికి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 45 శాతం మందికి రోజుకి 3 నుంచి 5 స్పామ్ కాల్స్ వస్తున్నాయి. రోజుకి 6–10 వరకు స్పామ్ కాల్స్ వస్తున్నాయని 16 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. 10 కంటే ఎక్కువ వస్తున్నాయని 5 శాతం మంది పేర్కొన్నారు’ అని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. శంలోని 342 జిల్లాల నుంచి మొత్తం 56 వేల మంది యూజర్ల రెస్పాన్స్‌ను తన ఫ్లాట్‌పామ్ ద్వారా తీసుకొని ఈ సర్వే చేసింది. ఇందులో 66 శాతం మంది మగవారు ఉన్నారని, 34 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపింది. వీరికి సపరేట్‌గా డిఫరెంట్ ప్రశ్నలు వేశామని పేర్కొంది.
ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లు అమ్మేవారే..
పైసా బజార్, పాలసీ బజార్ వంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను అమ్మే సైట్‌లతో యూజర్లు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సైట్‌లలో పర్సనల్ డేటా ఇచ్చినవారికి వివిధ ఎన్‌బీఎఫ్‌సీలు, లోన్ యాప్‌లు, బ్యాంకుల నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం, స్పామ్ కాల్స్‌లో 60 శాతం ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను అమ్మేవే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్‌లను అమ్మేవి 18 శాతం, జాబ్ ఆఫరింగ్ లేదా సంపాదించే అవకాశం ఇస్తున్నామనే చెప్పే కాల్స్ 10 శాతం ఉన్నాయని లోకల్ సర్కిల్స్ పేర్కొంది. ఏ కేటగిరీ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయనే ప్రశ్నకు సమాధానంగా 15,186 మంది యూజర్లు స్పందించారని ఈ సర్వే పేర్కొంది.
ప్రతీ ఇద్దరిలో ఒకరికి..
పెస్కీ, రోబో, సేల్స్, ప్రమోషనల్ కాల్స్ వంటివి ఎలా వస్తున్నాయి? అనే ప్రశ్నకు రెస్పాండెంట్లు స్పందించారు. ఈ ప్రశ్నకు 15,312 మంది రెస్పాండ్ అవ్వగా, పర్సనల్ నెంబర్ల ద్వారా ఇటువంటి కాల్స్ వస్తున్నాయని 50 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 29 శాతం మంది మాత్రం కంపెనీలు లేదా బ్రాండ్‌లకు చెందిన వివిధ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని అన్నారు. సెంట్రలైజ్డ్ ల్యాండ్‌లైన్ నెంబర్ నుంచి పెస్కీ కాల్స్ వస్తున్నాయని 14 శాతం మంది, కచ్చితంగా చెప్పలేమని 7 శాతం మంది వెల్లడించారు. యూజర్లకు వస్తున్న ప్రతీ రెండు స్పామ్ కాల్స్‌లో ఒకటి పర్సనల్ నెంబర్ నుంచే ఉందని ఈ సర్వే పేర్కొంది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు యూజర్ల డేటాను సేకరించి, ఈ డేటాను ఇతర కంపెనీలతో పంచుకుంటున్నాయి. ఈ కంపెనీల ఎంప్లాయీస్ తమ పర్సనల్ నెంబర్లతో యూజర్లకు కాల్ చేస్తున్నారని లోకల్ సర్కిల్స్ పేర్కొంది. టెలికం ఆపరేటర్లు తీసుకొచ్చిన డీఎన్‌డీ సరిగ్గా పనిచేయకపోవడానికి ఇదే కారణమని వెల్లడించింది. కాగా, ఆపరేటర్లు కమర్షియల్ కమ్యూనికేషన్స్‌ను ఆపగలవు కాని ఇండివిడ్యువల్ కాల్స్‌ను ఆపలేవు.
ట్రాయ్ చర్యలు ఫలితాన్నివ్వట్లే..
స్పామ్ కాల్స్‌ను తగ్గించేందుకు ట్రాయ్ తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలితాన్నివ్వడం లేదని లోకల్ సర్కిల్స్ పేర్కొంది. డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) సర్వీస్‌లను ట్రాయ్, టెలికం ఆపరేటర్లు తీసుకొచ్చాయి. యూజర్ తమ ఆపరేటర్ వెబ్‌సైట్‌కు వెళ్లి లేదా కాల్ చేసి తమ నెంబర్‌ను డీఎన్‌డీ లిస్టులో పెట్టుకోవచ్చు. దీంతో యూజర్లకు కమర్షియల్ కాల్స్ ఆగిపోతాయి. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తోందని అడగగా, 15,040 రెస్పాండెంట్లలో కేవలం 4 శాతం మంది మాత్రమే కమర్షియల్ కాల్స్ రావడం తగ్గాయని వెల్లడించారు. 92 శాతం మంది మాత్రం డీఎన్‌డీ పెట్టుకున్నా, స్పామ్ కాల్స్ వస్తున్నాయని అన్నారు.
©️ VIL Media Pvt Ltd.