రైల్లో పెళ్లి కొడుక్కి మత్తు మందు ఇచ్చి.. పరారైన పెళ్లి కూతురు, అసలు ట్విస్ట్ ఏంటంటే..?

పెళ్లీడు దాటిపోతున్నప్పటికీ పెళ్లిళ్లు కాని అబ్బాయిల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీంతో కొందరు అబ్బాయిలు రాష్ట్రాలు దాటి వెళ్లి.. పేదింటి అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్లి మోసాల బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన అంకిత్ అనే యువకుడు వివాహం చేసుకోవడం కోసం తన కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలోని సహజాన్వాకు వెళ్లాడు. ఫిబ్రవరి 6న గుడియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక.. సరదాగా వారణాసి వెళ్లారు. అక్కడి నుంచి అజ్మీర్ వెళ్లడం కోసం పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు వధువుతో కలిసి రైల్లో జైపూర్ బయల్దేరారు. పెళ్లి కూతురితోపాటు నాగినా అనే మరో మహిళ కూడా వెళ్లింది.

అలా కొద్ది దూరం వెళ్లాక పెళ్లి కూతురు తరఫు అంటూ.. ఛోటూ అనే అతడు రైలెక్కాడు. వస్తూ వస్తూ తనతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, టీ తీసుకొచ్చాడు. వాటిని తినమని పెళ్లి కొడుకుతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. తిన్న కాసేపటికే వారంతా స్పృహ కోల్పోగా.. వారి దగ్గరున్న విలువైన వస్తువులు, నగదు తీసుకొని.. పెళ్లి కూతురైన గుడియాతోపాటు, నాగినా, ఛోటూ కాన్పూర్‌లో రైలు దిగి పరారయ్యారు.

పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చి చూసే సరికి మిగతా ముగ్గురూ కనిపించలేదు. తమ దగ్గరున్న ఆభరణాలు, డబ్బు కూడా మాయమైనట్లు గుర్తించారు. దీంతో మోసపోయమని గ్రహించిన వారు.. ఎటావాలో దిగి గవర్నమెంట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులంతా మత్తులోకి జారుకోగానే.. వారి దగ్గర్నుంచి మొత్తం దోచేసుకున్న గుడియా, నాగినా, ఛోటూ.. రైలు దిగి.. ప్రయాగ్‌ రాజ్‌లో బస్సెక్కి వారణాసి వైపు బయల్దేరారు. అక్కడి నుంచి రైల్లో గోరఖ్‌పూర్ వెళ్లాలని భావించారు. కానీ వారణాసి రైల్వే స్టేషన్లో రెడీగా ఉన్న జీఆర్పీ పోలీసులు గుడియాతోపాటు నాగినాను అదుపులోకి తీసుకున్నారు.

బాధిత కుటుంబం ఈ పెళ్లి చేసుకోవడానికి గానూ వధువుకు రూ.80 వేలు నగదు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్లోనూ కొంత నగదును బదిలీ చేసిందిట. అసలు ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి కూతురుకు ఇది రెండో పెళ్లట. ఆ విషయాన్ని దాచి పక్కా స్కెచ్‌తో ట్రాప్ చేసే ప్రయత్నంలో ఇలా అడ్డంగా బుక్కయ్యారన్నమాట.

దాదాపు ఇలాంటి ఘటనే గత ఏడాది నవంబర్‌లో అజ్మీర్‌లో మరొకటి చోటు చేసుకుంది. యూపీకి చెందిన ప్రియాంక గుప్తాను మోహిత్ అనే వ్యక్తి పెళ్లి చేసుకొని తమ ఊరికి తీసుకొచ్చాడు. తెల్లారి నిద్ర లేచే సరికే ఇంట్లో నుంచి ప్రియాంక పారిపోయినట్లు గుర్తించారు.. లాకర్లోని డబ్బు, నగలు కూడా మాయమైనట్లు గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *