Nagar Kurnool: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇకపై సాయంత్రం అల్పాహారం

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను అత్యున్నత ర్యాంకులు సంపాదించేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులకు సరైన మార్కులు రాకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇందుకు తగినట్టుగానే విద్యాశాఖ అధికారులు పక్కాగా చర్యలు చేపట్టి విద్యార్థులను పరీక్షల్లో ప్రతిభను కనబరిచే విధంగా చర్యలు చేపడుతున్నారు.

అయితే ప్రభుత్వ పాఠశాలలో చాలావరకు పేద విద్యార్థులే ఎక్కువగా చదువుతూ ఉంటారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉంటూ తరగతులకు హాజరయ్యేలా,స్టడీ అవర్ నిర్వహించేలా, స్లిప్ టెస్టులు నిర్వహించేలా అధికారులు ఒక ప్రణాళికను చేపట్టారు.

అయితే చాలామంది పేద విద్యార్థులకు పోషకాహారం లోపం ఉన్నట్టుగా గుర్తించినటువంటి ప్రభుత్వం విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు, అదేవిధంగా పాఠశాలలో ఎక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు. కాగా ఇప్పుడు సాయంత్రం అల్పాహారాన్ని కూడా అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం ఈ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది.

వార్షిక పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం మధ్యాహ్నం క్లాసులు నిర్వహించడమే కాకుండా.. సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టి నీరసించిపోవడమే కాకుండా చదువుపై దృష్టి సాగించలేకపోతున్నారు.

విద్యార్థుల ఆకలి కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం సాయంత్రం వేళలో స్నాక్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావలసిన నిధులను కూడా మంజూరు చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు మొత్తం 131 మంది ఉండగా, ఉన్నత పాఠశాలలో 5,705 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు 15 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఈనెల 15 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 1 వరకు ప్రతి విద్యార్థికి ఈ స్నాక్స్ ను అందజేయనున్నారు. అంటే దాదాపుగా 34 రోజులపాటు సాయంత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందజేస్తున్నారు. గతంలో ఆయా పాఠశాలలో విద్యార్థులకు స్నాక్స్ అందించే బాధ్యతలు పలు దాతలు సహకారంతో తీసుకొని నిర్వహించడం జరిగింది. అయితే కొన్నిచోట్ల దాతలు ఉన్నా మరికొన్ని చోట్ల దాతలు సహకరించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులకు అందజేసే అల్పాహారానికి సంబంధించి ఇప్పటికే నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ నిధులతో విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారమైన అరటి పండ్లు, పల్లి పట్టిలు, బిస్కెట్లు, మినుప లడ్డూలు, రాగి జావతో పాటు ఇంకా పలు రకాల స్నాక్స్ అందజేయనున్నారు. ఈ స్నాక్స్ ను అందించే బాధ్యతను మధ్యాహ్నం భోజనం అందజేసే వంట ఏజెన్సీలకే అప్పగించడం జరిగింది.

మధ్యాహ్నం భోజనం మాదిరిగానే ప్రభుత్వం సూచించే ప్రత్యేకమైన మెనూ ప్రకారం ఈ స్నాక్స్ ను అందజేయనున్నారు. అయితే జిల్లాలో 5705 మంది విద్యార్థులకు సంబంధించి మొత్తం 29.09 లక్షల నిధులను ఎస్ఎంసి ఖాతాలో ఇప్పటికే జమ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *