ఆ గుడిలో ఏటా పెరుగుతున్న శివలింగం..శివాలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టమైన ఇట్టే మాయం

(Syed Rafi, News18,Mahabubnagar)

మహాశివరాత్రిని పురస్కరించుకొని..దేశ వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు,శివాలయాలు శివన్మామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోని రంగారెడ్ది(Rangareddy) జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్(Raikal)గ్రామంలోని శివాలయంలో ఉన్న లింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముడు(Lord Rama)ప్రతిష్ఠించినట్టుగా మాణిక్య ప్రభు(Manikya Prabhu) చరిత్రలో పేర్కొన్నారు అందుకు గుర్తుగా శివలింగంపై రామబాణం గుర్తు ఉంటుంది. పంచముఖగుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడంతో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత నెలకొంది. ఉత్తర రామేశ్వరం(North Rameswaram)గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తులంకాధిపతి రావణాసురని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసారని భక్తుల విశ్వాసం.

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం..

ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్లు భూగర్భంలోనే ఉండిపోయినట్టు చరిత్ర చెబుతుంది. రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడైన నరసింహారాయులు తపస్సు చేస్తుండుగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శన మిచ్చాడు. బదిరీ వృక్షం కింద శివలింగం ఉందనీ, దాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. దీంతో ఆయన శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహారాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయం, కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్టు చెబుతారు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతున్నాయి.

ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి..

మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం షాద్‌నగర్ ఎన్‌హెచ్ 44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయ‌కల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాద్ నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. మహాశివరాత్రి.. ఈ ఆలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి! అదేవిధంగా రామేశ్వరంలో రాజకీయ నాయకులు ఎమ్మేల్యే ఎన్నికల నామినేషన్ సమయంలో తమ పత్రాలు ఇక్కడ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనవాయితీ. నూతన వాహనాలు కొన్నవారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజులలో ఇక్కడ ప్రత్యేక భజన కార్యక్రమాలు ఉంటాయి.

Shivaratri: శ్రీ‌శైలానికి శివరాత్రి శోభ.. బ్ర‌హ్మోత్స‌వాల‌కు పోటెత్తిన శివయ్య భ‌క్తులు

 ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..

శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వర బ్రహ్మోత్సవాలు ఈనెల 14 నుండి ప్రారంభం అయ్యాయి. 14వ తేదీన గణపతి పూజ, రుద్ర హోమం, అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమం నుండి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బుధవారం పార్వతి పరమేశ్వరుల కల్యాణోత్సవం జరుగుతుంది. గురువారం ఏకాదశి, రుద్రాభిషేకం, నంది సేవ, అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం ద్వాదశి రుద్రాభిషేకం, శనివారం త్రయోదశి, మహాశివరాత్రి పర్వదినం కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం చతుర్దశి, రుద్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. సోమవారం అమావాస్య రాత్రి 9 గంటలకు పార్వతీ పరమేశ్వరుల రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం 22వ తేదీన విదియ శివ తీర్థంతో జాతర ముగుస్తుందని ఆలయ అధికారులు తెలిపారు .

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

భక్తులకు మహాశివరాత్రి సందర్భంగా స్పర్శ దర్శనం మాత్రమే ఉంటుందనీ, అభిషేకాలు ఉండవని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. స్వామివారి కల్యాణము చేయించుకునేవారు భక్తులు 516 రూపాయలను చెల్లించి స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ ప్రభాకర్ రావు, వంశపారపర్య అర్చకులు ప్రహ్లాదాచార్యులు, కార్యనిర్వహణాధికారి రామశర్మ తెలిపారు. ఇదిలా ఉండగా షాద్ నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యార్థం ప్రత్యెక బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *